Uber,Ola cab rides: క్యాబ్ బుక్ చేస్తున్నారా? ముందే టిప్ అడిగితే ఇక ఇవ్వొద్దు.. కేంద్రం ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
క్యాబ్ బుక్ చేసే సమయంలో ప్రయాణం మొదలయ్యే ముందే 'టిప్ ఇస్తారా?' అంటూ అడిగే విధానానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ఉబర్, ఓలా వంటి క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు రైడ్ ప్రారంభానికి ముందే ప్రయాణికుల నుంచి టిప్ కోరేలా ఎలాంటి ప్రాంప్ట్‌లు చూపించకూడదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రయాణికుల్లో అపోహలు కలగకూడదు క్యాబ్ త్వరగా లభించాలన్నా, డ్రైవర్ బుకింగ్‌ను అంగీకరించే అవకాశం పెరగాలన్నా అదనంగా డబ్బు చెల్లించాల్సిందేననే అభిప్రాయం ప్రయాణికుల్లో ఏర్పడకూడదని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకోసం క్యాబ్ అగ్రిగేటర్ యాప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వెంటనే సమీక్షించి అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించింది.
వివరాలు
కొన్ని యాప్‌లలో ఇలాంటి సందేశాలు
ఇటీవల కొన్ని క్యాబ్ యాప్‌లలో 'అడ్వాన్స్ టిప్', 'చూజ్ యాడ్-ఆన్', 'రైడ్ త్వరగా కన్ఫర్మ్ అయ్యే అవకాశాన్ని పెంచుకోండి' వంటి సందేశాలు కనిపించినట్లు నివేదికలు వెలువడ్డాయి.
దీంతో టిప్ చెల్లిస్తే క్యాబ్ త్వరగా లభిస్తుందా? డ్రైవర్ రైడ్‌ను అంగీకరించే అవకాశం పెరుగుతుందా? అనే సందేహాలు ప్రయాణికుల్లో తలెత్తాయి.
2025 మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాల్లో ఏముంది?
2025 మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాల ప్రకారం.. రైడ్ పూర్తయ్యేలోపు ప్రయాణికుడిని టిప్ ఇవ్వాలని అడగడం నిబంధనలకు విరుద్ధం.
అంతేకాకుండా అదనపు చెల్లింపు చేస్తే క్యాబ్ లభ్యత, డ్రైవర్ కేటాయింపు, వేచి ఉండే సమయం లేదా సేవా నాణ్యత మెరుగవుతుందనే భావన కలిగించడం కూడా నిబంధనల ఉల్లంఘనే.
వివరాలు
టిప్ ఇవ్వడంపై నిషేధం లేదు
అయితే ప్రభుత్వం టిప్ ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధించలేదు. ప్రయాణం ముగిసిన తర్వాత ప్రయాణికుడు తన ఇష్టానుసారం డ్రైవర్‌కు టిప్ ఇవ్వవచ్చు.
అలా ఇచ్చిన మొత్తంపై క్యాబ్ అగ్రిగేటర్ ఎలాంటి మొత్తాన్ని మినహాయించకూడదు. ప్రయాణికుడు ఇచ్చిన టిప్ పూర్తిగా డ్రైవర్‌కే చెందాలి.
ఇప్పటికే సీపీపీఏ ఆదేశాలు
ముందస్తు టిప్ విధానంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీపీపీఏ) గతంలోనే క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాలతో ఈ నిబంధన మరింత స్పష్టత పొందింది.
దీంతో క్యాబ్ యాప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు తమ బుకింగ్ విధానాలను సమీక్షించి తగిన మార్పులు చేయాల్సి ఉంటుంది.