LOADING...
President: రాష్ట్రపతి వాహనానికి జీఎస్టీ మినహాయింపు..?
రాష్ట్రపతి వాహనానికి జీఎస్టీ మినహాయింపు..?

President: రాష్ట్రపతి వాహనానికి జీఎస్టీ మినహాయింపు..?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాన్వాయ్‌లోకి కొత్త కారు రాబోతోంది. ప్రస్తుతం ఆమె ప్రయాణాల కోసం మెర్సిడెస్‌ బెంజ్‌ ఎస్‌-600 పుల్‌మ్యాన్‌ లిమోజిన్‌ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు దాని స్థానంలో అధునాతన బీఎండబ్ల్యూ కారును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. కొత్త కారుకు ఖర్చు సుమారు రూ.3.66 కోట్లు. సాధారణంగా రాష్ట్రపతి వాహనాలు కాలానుగుణంగా అప్‌గ్రేడ్‌ చేస్తుంటారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వాహనాలు విలాసవంతమైనవి మాత్రమే కాకుండా, ప్రత్యేకమైన బుల్లెట్‌ ప్రూఫ్‌ ఫీచర్లతో కస్టమ్‌గా రూపొందించబడతాయి. ఆ రీతిలోనే ఈసారి కొత్త బీఎండబ్ల్యూ వాహనం అందుబాటులోకి రానుంది.

వివరాలు 

రాష్ట్రపతి వాహనానికి మాత్రం జీఎస్టీ కౌన్సిల్‌ ప్రత్యేక సడలింపు

సాధారణంగా ఇలాంటి హైఎండ్‌ కార్లను ఎవరైనా దిగుమతి చేసుకుంటే,వాటిపై భారీగా పన్నులు పడతాయి. వాహనం బేసిక్‌ ధరపై కస్టమ్స్‌ డ్యూటీతో పాటు అదనపు సెస్సులు కూడా కలుస్తాయి. అంతేకాకుండా,ప్రస్తుతం ఈ తరహా లగ్జరీ కార్లపై 28 శాతం జీఎస్టీ లేదా (కొత్త రేట్ల ప్రకారం) 40 శాతం వరకు ఐజీఎస్టీ వర్తిస్తుంది. ఫలితంగా వాహనం ధర దాదాపు రెండింతలు పెరుగుతుంది. కానీ రాష్ట్రపతికి అవసరమయ్యే ఈ వాహనానికి మాత్రం జీఎస్టీ కౌన్సిల్‌ ప్రత్యేక సడలింపు ఇచ్చింది. ఈ క్రమంలో ఐజీఎస్టీ, అదనపు సెస్సులు వసూలు చేయకుండా మినహాయింపు కల్పించాలని సిఫారసు చేయగా, ఇటీవలి కాలంలో కేంద్రం, రాష్ట్రాలు కూడా దానికి ఆమోదం తెలిపాయి.

వివరాలు 

మెర్సిడెస్‌ ఎస్‌-600 పుల్‌మ్యాన్‌ గార్డ్‌ కారు భద్రతాపరంగా అద్భుతమైన ఫీచర్లు 

ఇలాంటి మినహాయింపులు సాధారణంగా చాలా అరుదు. ప్రభుత్వ ప్రయోజనాలు లేదా ప్రజా అవసరాల దృష్ట్యా వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఈ రకమైన ప్రత్యేక అనుమతులు ఇస్తారు. తాజా చర్యతో ప్రెసిడెంట్‌ సెక్రటేరియట్‌ ఎటువంటి పన్నులు చెల్లించకుండా వాహనం కొనుగోలు చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం వాడుతున్న మెర్సిడెస్‌ ఎస్‌-600 పుల్‌మ్యాన్‌ గార్డ్‌ కారు భద్రతాపరంగా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో బాలిస్టిక్‌ రక్షణ, హెవీ ఆర్మర్‌ ప్లేటింగ్‌, బహుళ లేయర్లతో రూపొందించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌, స్వీయంగా మూసుకునే ఇంధన ట్యాంక్‌, అత్యాధునిక టైర్లు, ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థ వంటివి ఉన్నాయి.