Honda Activa 7G: త్వరలో హోండా యాక్టివా 7జీ.. మైలేజ్ ఎంతంటే..?
ప్రస్తుతం, భారతదేశంలో స్కూటీల అమ్మకాలు బైక్లను సమానంగా తాకుతున్నాయి. ఇందులో టీవీఎస్, హోండా కంపెనీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఇటీవల, టీవీఎస్ జూపిటర్ 110ను మార్కెట్లోకి తీసుకువచ్చింది, ఇదే సమయంలో హోండా యాక్టివా 7జీని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. హోండా ఇప్పటికే యాక్టివా 4జీ, 5జీ, 6జీ స్కూటీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇవి వినియోగదారుల నుండి మంచి స్పందన పొందాయి. ఈ విజయవంతమైన వేరియంట్ల అనంతరం, హోండా ఇప్పుడు యాక్టివా 7జీని త్వరలో మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.
యాక్టివా 7జీ లాంచ్, ధర
హోండా కంపెనీ యాక్టివా 7జీ స్కూటీని 2025 జనవరిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, కంపెనీ ఈ లాంచ్ గురించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. యాక్టివా 7జీ కూడా మంచి మైలేజ్ ఇస్తుందని అంచనా. ఇది ప్రతి లీటర్ పెట్రోల్‌కు సుమారు 55 నుండి 60 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వనుంది. యాక్టివా 7జీ ధర సుమారు రూ.90,000 వరకు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
యాక్టివా 7జీ టెక్నాలజీ ఫీచర్లు
ఈ స్కూటీ అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించబడినట్లు సమాచారం. యాక్టివా 7జీలో డిజిటల్ స్క్రీన్, మొబైల్ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జర్, ఎల్‌ఈడీ లైట్లు వంటి ఆధునాతన ఫీచర్లు ఉంటాయి. అలాగే, కార్లలో ఉన్న పుష్ బటన్ స్టార్ట్ ఫీచర్‌ను కూడా అందించే అవకాశం ఉంది. సైలెంట్ స్టార్ట్ ఫీచర్,అలాయ్ వీల్స్‌తో కూడిన ఈ స్కూటర్ 109 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 7.6 bhp పవర్, 8.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటీకి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశాలున్నాయి. భారత స్కూటీ మార్కెట్లో టీవీఎస్,హోండా మధ్య పోటీ తీవ్రమైందని చెప్పొచ్చు.హోండా తన సరికొత్త యాక్టివా 7జీని విపణిలో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుండగా,వినియోగదారులు దీనికై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.