LOADING...
Honda: EV ప్లాన్‌లకు బ్రేక్.. హోండాకు $4 బిలియన్ నష్టం అంచనా
EV ప్లాన్‌లకు బ్రేక్.. హోండాకు $4 బిలియన్ నష్టం అంచనా

Honda: EV ప్లాన్‌లకు బ్రేక్.. హోండాకు $4 బిలియన్ నష్టం అంచనా

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హోండా ఎలక్ట్రిక్ వాహనాల(EV)ప్రణాళికల్లో పెద్ద మార్పులు చేసింది. ఉత్తర అమెరికా మార్కెట్ కోసం అభివృద్ధి చేస్తున్నమూడు ఎలక్ట్రిక్ కార్ల ప్రాజెక్టులను కంపెనీ రద్దు చేసింది. EVలకు సంబంధించిన ఖర్చులు పెరుగుతుండటంతో కంపెనీ చేపట్టిన రీస్ట్రక్చరింగ్ ప్లాన్‌లో భాగంగా ఈనిర్ణయం తీసుకుంది. ఈనిర్ణయంతో కంపెనీకి సుమారు 4బిలియన్ డాలర్లకు పైగా నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రద్దు చేసిన మోడళ్లలో Honda 0 SUV,Honda 0 Saloonసెడాన్,అలాగే Acura RSX ఉన్నాయి. ఈవాహనాలను ఈఏడాది చివర్లో అమెరికాలోని ఓహియోలో ఉన్న హోండా EV హబ్‌లో తయారు చేయాలని కంపెనీ ముందుగా ప్రణాళిక రూపొందించింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆప్రాజెక్టులను పూర్తిగా నిలిపివేసింది.

వివరాలు 

అమెరికా విధాన మార్పులు, చైనా పోటీ ప్రభావం

అమెరికాలో ఇటీవల జరిగిన విధాన మార్పులు కూడా హోండా నిర్ణయంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంధన సామర్థ్య ప్రమాణాలను కొంత సడలించడం, అలాగే ఫెడరల్ EV సబ్సిడీలను ముగించడం వంటి నిర్ణయాలు కంపెనీ EV వ్యూహాన్ని మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి. ఇదిలా ఉండగా, చైనా కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ కూడా హోండాకు సవాల్‌గా మారింది. ఇదే కారణాలతో హ్యుందాయ్, ఫోర్డ్ వంటి ఇతర ప్రముఖ ఆటో కంపెనీలు కూడా ఇటీవల తమ ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టులను వాయిదా వేసిన లేదా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వివరాలు 

చైనా EV కంపెనీల వేగం

ప్రపంచ EV మార్కెట్‌లో చైనా కంపెనీలు వేగంగా ముందుకు వస్తున్నాయి. తక్కువ సమయంలో కొత్త మోడళ్లను అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి తీసుకువచ్చే సామర్థ్యంతో అవి గట్టి పోటీ ఇస్తున్నాయి. చైనా EV దిగ్గజం BYDకు చెందిన లగ్జరీ బ్రాండ్ డెంజా ఇటీవల కొత్త మోడల్‌ను విడుదల చేసింది. చైనా CLTC పరీక్ష ప్రమాణాల ప్రకారం ఈ వాహనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,036 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ ప్రకటించింది. ఇది ప్రపంచ EV మార్కెట్‌లో చైనా కంపెనీల పెరుగుతున్న శక్తిని చూపిస్తోంది.

Advertisement

వివరాలు 

హోండా ఆర్థిక అంచనాలు

2026 మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి హోండా భారీ నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది. ఆపరేటింగ్ ఖర్చులు ¥820 బిలియన్ నుంచి ¥1.12 ట్రిలియన్ వరకు ఉండవచ్చని తెలిపింది. అదే సమయంలో నికర నష్టాలు ¥690 బిలియన్ (సుమారు 4.3 బిలియన్ డాలర్లు) వరకు పెరిగే అవకాశం ఉందని తాజా హెచ్చరికలో పేర్కొంది. EV వ్యూహంలో మార్పుల కారణంగా వచ్చే ఏడాది కూడా అదనపు ఖర్చులు, నష్టాలు ఉండే అవకాశముందని కంపెనీ భావిస్తోంది.

Advertisement

వివరాలు 

భవిష్యత్ వ్యూహం

ఇలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ హోండా పూర్తిగా వెనక్కి తగ్గే ఉద్దేశంలో లేదు. కంపెనీ తన హైబ్రిడ్ వాహనాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార వ్యూహాన్ని పునఃసమీక్షించి, వనరుల కేటాయింపును మళ్లీ సమీక్షించనుంది. ఈ కొత్త గ్లోబల్ వ్యూహాన్ని మే నెలలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

Advertisement