హోండా హార్నెట్ 2.0 మోడల్ వచ్చేసింది.. అపాచీ ఆర్టీఆర్ 180తో సైసై
భారతీయ ఆటో మార్కెట్ లోకి హార్నెట్ 2.0 బైక్ ప్రవేశించింది. దేశీయ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ ఇండియా తీసుకొచ్చిన ఈ కొత్త ద్విచక్ర వాహనం ధర రూ.1.39(ఎక్స్ షోరూమ్) లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఈ మేరకు మోటారు సైకిల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే హాట్ మోడళ్లను విడుదల చేసిన ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా జోరు కొనసాగిస్తోంది. తాజాగా కొత్త హార్నెట్ 2.0 (Honda Hornet 2.0) వాహనాన్ని భారత ఆటో మార్కెట్లో ఆవిష్కరింపజేసింది. రెండో దశలో భాగంగా బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా హార్నెట్ 2.0 బైక్ రూపుదిద్దుకుంది. అంతేకాకుండా మరిన్ని కొత్త ఫీచర్లను జత చేసుకుంది.
10 సంవత్సరాల వారంటీని అందిస్తున్న హోండా హార్నెట్
పండుగ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్‌లో డెలివరీలను ప్రారంభించనున్నట్లు హోండా మోటార్ సైకిల్స్ ప్రకటించింది. మరోవైపు హోండా హార్నెట్ 2.0 మోడల్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 మోటారు సైకిల్‌తో ఢీ అంటే ఢీ అనేలా పోటీ పడుతోంది. దీంతో హార్నెట్ మోటారు సైకిల్‌పై కంపెనీ 10 సంవత్సరాల వారంటీని సైతం అందిస్తోంది. మూడేళ్ల స్టాండర్డ్, ఏడేళ్ల ఆప్షనల్ వారంటీలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. హార్నెట్ బైక్, ఎల్ఈడీ హెడ్ లైట్స్,ఫ్యుయల్ ట్యాంకుతోపాటు షార్ప్ బాడీ ప్యానెల్స్, న్యూ గ్రాఫిక్స్‌తో అగ్రెసివ్ లుక్‌ను సంతరించుకుంది. 4 కలర్లలో ఈ బైక్ లభించనుంది. 184.4 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో మోడల్ తయారవడం ఈ బైక్ ప్రత్యేకతగా నిలుస్తోంది.