Penalties on Carmakers:ఉద్గార ఉల్లంఘనపై హ్యుందాయ్, మహీంద్రా, కియా కంపెనీలకు రూ.7,300 కోట్ల జరిమానా
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థలు హ్యుందాయ్, మహీంద్రా, కియా సహా 8 కంపెనీలకు కేంద్రం భారీ జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం. ఈ సంస్థలపై దాదాపు రూ.7,300 కోట్ల పెనాల్టీ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థల వాహనాల్లో ఉద్గారాలు అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెప్పబడుతోంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ తన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా, కార్ల కంపెనీలు విక్రయించే ప్రతి యూనిట్‌కు 100 కిలోమీటర్ల ప్రయాణానికి 4.78 లీటర్ల ఇంధన వినియోగం, కర్బన ఉద్గారాలు కిలోమీటరుకు 113 గ్రాముల పైగా ఉండరాదని ఆదేశాలు ఇచ్చింది.
నిబంధనలను ఉల్లంఘించిన 8 ఆటోమొబైల్ కంపెనీలు
అయితే, ఆ ఆర్థిక సంవత్సరంలో 8 ఆటోమొబైల్ కంపెనీలు ఈ నిబంధనలను ఉల్లంఘించాయని కేంద్రం గుర్తించింది. దీంతో, ఈ సంస్థలపై పెనాల్టీ విధించే అవకాశం ఉంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ 8 సంస్థలకు మొత్తం రూ.7,290.8 కోట్ల జరిమానా పడే అవకాశముందని తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా హ్యుందాయ్‌కు రూ.2,837.8 కోట్ల జరిమానా, మహీంద్రాకు రూ.1,788.4 కోట్ల జరిమానా, కియాకు రూ.1,346.2 కోట్ల జరిమానా విధించనున్నట్లు సమాచారం.
ఆటో పరిశ్రమ, కేంద్రం మధ్య చర్చలు
ఇతర సంస్థలకు కూడా జరిమానా విధించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హోండాకు రూ.457.7 కోట్ల, రెనాల్ట్‌కు రూ.438.3 కోట్ల, స్కోడాకు రూ.248.3 కోట్ల, నిస్సాన్‌కు రూ.172.3 కోట్ల, ఫోర్స్ మోటార్‌కు రూ.1.8 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చర్యలు, నిబంధనలను అమలు చేయడంపై ఆటో పరిశ్రమ, కేంద్రం మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 2023 జనవరి 1 నుండి కొత్త నిబంధనలు కఠినంగా అమలు అవుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.