NCAPకి మూడు మోడళ్లను పంపిన హ్యుందాయ్.. సెఫ్టీ రేటింగ్ పొందడమే లక్ష్యం
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మూడు కొత్త మోడళ్లను త్వరలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఈ మోడళ్లను ఇండియాకు చెందిన NCAPకి ఆ సంస్థ సమర్పించింది. ఇందులో టక్సన్ ఎస్‌యూవీ ఒకటి. టక్సన్‌ను ఎక్స్‌టర్ మైక్రో-ఎస్‌యూవీ అనుసరించాల్సి ఉంది. మరో రెండు కార్ల ఫలితాలు రాబోయే కొద్ది నెలల్లో వెల్లడి కానున్నాయి. భారతదేశంలో తన ప్రీమియర్ ICE వాహనం కోసం 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందడమే తమ లక్ష్యమని హ్యుందాయ్ స్పష్టం చేసింది. ప్రస్తుత తరం టక్సన్ ఇప్పటికే యూరో NCAP, లాటిన్ NCAP ద్వారా వరుసగా 2021, 2022లో టెస్టింగ్ చేయించుకున్న విషయం తెలిసిందే. టెస్టింగ్‌లో స్వల్ప వ్యత్యాసాల కారణంగా అప్పట్లో 3-స్టార్ రేటింగ్‌ను సంపాదించింది.
ఫలితం కోసం ఎదురుచూస్తున్న హ్యుందాయ్
టక్సన్ ఇండియన్ వెర్షన్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC, మూడు-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ఒక్కో సీటుకు సీట్‌బెల్ట్ రిమైండర్‌లు ప్రామాణిక ఫీచర్లుగా ఉన్నాయి. హై-ఎండ్ టక్సన్ ADAS సామర్థ్యాలను కూడా కలిగి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల భారత్ NCAP టెస్టింగ్ ఆలస్యమైంది. ఇండియాలో NCAP టెస్టింగ్ అక్టోబర్ 1న ప్రారంభమైంది. ఇండియాలో NCAP క్రాష్ టెస్ట్‌లలో అనుకూలమైన ఫలితాన్ని సాధించడం కోసం హ్యుందాయ్ సంస్థ ఎదురుచూస్తోంది.