Page Loader
India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు
India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు

India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని గణనీయంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఈవీ తయారీ సంస్థలకు దేశంలో ప్రవేశం కల్పించేలా కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు దేశీయంగా ఈవీ ఉత్పత్తిని ఉత్సాహపరిచేలా రూపొందించబడ్డాయి. దేశంలోనే ఉత్పత్తి చేసేందుకు భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న విదేశీ కంపెనీలకు దిగుమతి సుంకాల్లో సడలింపు లభించనుంది.

వివరాలు 

రూ. 4,150 కోట్ల పెట్టుబడి తప్పనిసరి 

భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ కొత్త విధానం కింద ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై సుంకాలు తగ్గించనున్నాయి. అయితే, దీనికి అర్హత పొందాలంటే కంపెనీలు కనీసం రూ. 4,150 కోట్ల పెట్టుబడిని ప్రతిజ్ఞ చేయాలి. కేంద్రం రూపొందించిన ఈ మార్గదర్శకాలు ప్రముఖ అంతర్జాతీయ ఈవీ తయారీదారులు భారతదేశంలో తమ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించబడ్డాయి.

వివరాలు 

మూడు సంవత్సరాల్లోగా అమలు చేయాలి 

ఈ పథకం 2024 మార్చిలో ప్రకటించారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే సంస్థలు ముందుగా పేర్కొన్న పెట్టుబడిని వాగ్దానం చేయాలి. ఆమోదం పొందిన తేదీ నుంచి మూడు సంవత్సరాల లోపు తమ పెట్టుబడిని పూర్తిగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నిధులను వాహన ఉత్పత్తి కేంద్రాలు, పరిశోధన, అభివృద్ధి శాఖలు (R&D), ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర అనుబంధ సౌకర్యాల ఏర్పాటు కోసం వినియోగించాలి. ఈ పథకం స్టార్టప్‌లకు కాదని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఇప్పటికే ఆర్థికంగా, సాంకేతికంగా స్థిరంగా ఉన్న విదేశీ కార్ల తయారీ సంస్థలనే లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు 

దిగుమతులపై పన్ను రాయితీ 

ఈ పథకం కింద రూ. 29.75 లక్షలకంటే ఎక్కువ ధర గల పూర్తిగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై కేవలం 15 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించనున్నారు. అంటే, కంపెనీలు దిగుమతిచేసే వాహనాలపై పన్ను తగ్గింపు లభిస్తుంది.అయితే, సంవత్సరానికి గరిష్ఠంగా 8,000 వాహనాలకే ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ ప్రయోజనం మొత్తం ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. అయితే, సంస్థ పెట్టే పెట్టుబడి స్థాయిని బట్టి ఈ రాయితీ పరిమితి మారుతుంది. ఒక కంపెనీ ఏదైనా సంవత్సరం తమ పూర్తి దిగుమతి పరిమితిని ఉపయోగించకపోతే, మిగిలిన మొత్తాన్ని తదుపరి సంవత్సరానికి మారుస్తూ కొనసాగించవచ్చు. పైగా, ఈ విధానం ద్వారా కంపెనీలు నిబంధనలు పాటించాలన్న నిబద్ధత కలిగి ఉండేందుకు ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీని కూడా కోరుతోంది.

వివరాలు 

చక్రాల విభాగంలో ముందడుగు 

ఇది మొత్తం రూ. 4,150 కోట్ల పెట్టుబడి లేదా ప్రభుత్వం అంచనా వేసే సుంకం మినహాయింపుకు సమానంగా ఉండాలి. ఈ పథకం ద్వారా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈవీ తయారీదారులను స్థానికంగా తమ తయారీ ప్లాంట్లు స్థాపించేందుకు ఆహ్వానిస్తోంది. ఇప్పటివరకు ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాల్లో దేశం మంచి పురోగతిని సాధించినప్పటికీ, నాలుగు చక్రాల విభాగంలో మాత్రం అభివృద్ధి చాలా మందగించింది. కొత్త పథకం ద్వారా ఆ లోటును పూడ్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం.