Kia Cars : కార్ల ధరల్ని పెంచిన కియా.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
దేశంలోనే కియా మోటర్స్‌కు ఆటో మొబైల్ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ సంస్థ నుంచి వచ్చిన కార్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. తాజాగా ఆ కంపెనీ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. కియా సెల్టోస్, కేరెన్స్ ధరలను అక్టోబర్ 1 నుంచి పెంచుతున్నట్లు కియా కంపెనీ స్పష్టం చేసింది. కియా సెల్టోస్ పై 2శాతం, కేరెన్స్ ఎంపీవీపై 5శాతం వరకు పెంచారు. కొత్త సెల్టోస్ ఈ ఏడాది ప్రారంభంలో జూలైలో రూ. 10.89 లక్షల నుండి రూ. 19.99 లక్షల ధరతో విడుదల చేసింది. రెండు నెలల్లోనే ఈ కారుకు 50 వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయి.
కియా కార్ల ధరలను పెంచడం ఇది రెండో సారి
కేరెన్స్ చివరిసారిగా మార్చి 2023లో ధరను పెంచింది. కియా కేరెన్స్ ధరలను 5శాతం వరకు పెంచడంతో వేరియంట్స్ ఆధారంగా రూ.10వేల నుండి నుండి రూ.50 వేల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. హ్యుందాయ్ అల్కాజార్, మారుతి XL6, టయోటా ఇన్నోవా క్రిస్టా, మారుతి ఎర్టిగా వంటి వాటితో కేరెన్స్ పోటీపడనుంది. కియా సెల్టోస్, కేరెన్స్ ధరలను పెంచుతున్నప్పటికీ, ఈ కార్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, ఎంట్రీ లెవల్ మోడల్ కారు సొనెట్ ధర పెంచడం లేదని కియా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కియా ఇండియా కార్ల ధరలు పెంచడం ఇది రెండోసారి.