Lexus LFA: 2012 తర్వాత మళ్లీ LFA బ్యాడ్జ్‌తో లెక్సస్ కొత్త కాన్సెప్ట్
ఈ వార్తాకథనం ఏంటి
లెక్సస్ సంస్థ తాజాగా 'ఎల్‌ఎఫ్‌ఏ కాన్సెప్ట్' పేరుతో కొత్త కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. 2012 తర్వాత మళ్లీ ప్రతిష్ఠాత్మక 'ఎల్‌ఎఫ్‌ఏ' బ్యాడ్జ్‌ను ఉపయోగించడం ఇదే తొలిసారి. గతంలో లెక్సస్ ఎల్‌ఎఫ్‌ఏ మోడల్‌ను 2010 నుంచి 2012 మధ్య కేవలం 500యూనిట్ల మాత్రమే తయారు చేసింది. అప్పట్లో ఇది అత్యంత శక్తివంతమైన న్యాచురల్ ఆస్పిరేటెడ్ వి10 ఇంజన్‌తో,నిమిషానికి 9,500 ఆర్‌పీఎం వరకు తిరిగే అరుదైన సూపర్ కార్‌గా గుర్తింపు పొందింది. అయితే కొత్త ఎల్‌ఎఫ్‌ఏ కాన్సెప్ట్ మాత్రం ఇప్పటివరకు ఉత్పత్తి దశకు చేరలేదు. అంతేకాదు,పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో అనేక కీలక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కార్‌గా రూపొందించారు. బ్యాటరీ సామర్థ్యం గానీ,పనితీరు వివరాలు గానీ కంపెనీ ప్రస్తుతం వెల్లడించలేదు.
వివరాలు
కొత్త కాన్సెప్ట్‌లో తేలికపాటి, బలమైన అల్యూమినియం చాసిస్
అయితే 'ఎల్‌ఎఫ్‌ఏ' అనే పేరు కేవలం పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్ వాహనాలకే పరిమితం కాదని, భవిష్యత్తు తరాలకు అందించే సాంకేతిక నైపుణ్యానికి ప్రతీకగా ఉండే వాహనాలకు ఈ పేరు ఉపయోగిస్తామని లెక్సస్ స్పష్టం చేసింది. డిజైన్ పరంగా చూస్తే, ఈ కొత్త కాన్సెప్ట్‌లో తేలికపాటి, బలమైన అల్యూమినియం చాసిస్‌ను ఉపయోగించారు. ఇదే చాసిస్‌ను టయోటా జీఆర్ జీటీ, జీటీ3 రేస్ కార్లలో కూడా వినియోగించారు. ఇటీవలి మోంటెరీలో ప్రకటించిన స్పోర్ట్ కాన్సెప్ట్‌లాగే దీనిది డిజైన్ ఉండగా, స్వల్ప మార్పులు మాత్రమే చేశారు.
వివరాలు
సాంప్రదాయ మీటర్ల డిస్ప్లే స్థానంలో..
ఈ కార్ పొడవు 4,690 మిల్లీమీటర్లు, వెడల్పు 2,040 మిల్లీమీటర్లు, వీల్‌బేస్ 2,725 మిల్లీమీటర్లుగా ఉండి, పాత ఎల్‌ఎఫ్‌ఏ కంటే పరిమాణంలో చాలా పెద్దదిగా మారింది. లోపల ఇంటీరియర్‌ను పూర్తిగా డ్రైవర్‌కు అనుకూలంగా కాక్‌పిట్ తరహాలో రూపొందించారు. సాంప్రదాయ మీటర్ల డిస్ప్లే స్థానంలో అనేక స్క్రీన్ల క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. అయితే మధ్యలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మాత్రం ఇవ్వలేదు. ఉత్పత్తి మోడల్ ఎప్పుడు విడుదల అవుతుంది, దాని ఖచ్చిత రూపం ఎలా ఉంటుంది అనే వివరాలు ఇంకా తెలియకపోయినా, డిజైన్, టెక్నాలజీ పరంగా లెక్సస్ భవిష్యత్తు దిశను ఈ కాన్సెప్ట్ స్పష్టంగా చూపిస్తోంది.