Luxury car sales: 2024లో లగ్జరీ కార్ల జోరు.. గంటకు ఆరు కార్లు విక్రయాలు
భారతీయ వినియోగదారుల్లో లగ్జరీ కార్లపై ఆసక్తి అంచనాలకు మించి పెరుగుతోంది. 50 లక్షల పైబడిన ధరలున్న ప్రీమియం మోడళ్ల విక్రయాలు గత కొన్నేళ్లుగా గణనీయమైన వృద్ధి సాధించాయి. 2024లో సగటున గంటకు ఆరు లగ్జరీ కార్లు అమ్ముడవుతున్నాయి. 2018లో ఇది గంటకు రెండు కార్ల విక్రయాలుగా ఉన్నా ఈ సంఖ్య ఇప్పుడు రెట్టింపు అయింది. సంపన్నుల పెరుగుదల, వినియోగదారుల అభిరుచుల మార్పు ఈ ట్రెండ్‌కి ప్రధాన కారణాలు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2020లో 20,500 లగ్జరీ కార్లు అమ్ముడవగా, 2021లో ఈ సంఖ్య 28,600కి, 2022లో 38,000కి, 2023లో 48,000కి చేరింది.
50,000 మార్క్ దాటే అవకాశం
2024లో తొలిసారి ఈ సంఖ్య 50,000 మార్క్ దాటుతుందని అంచనా. ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2023లో మొదటి 9 నెలల్లోనే ఈ సంస్థ 13శాతం వృద్ధితో 14,379 యూనిట్లు విక్రయించింది. బీఎండబ్ల్యూ సంస్థ 5% వృద్ధితో 10,556 కార్లను విక్రయించినా, ఆడియా ఇండియా సప్లయ్ చైన్ సమస్యల కారణంగా 15% క్షీణతను ఎదుర్కొంది. లగ్జరీ కార్ల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నా, భారతదేశంలో మొత్తం కార్ల విక్రయాల్లో వీటి వాటా కేవలం 1% మాత్రమే. ఇది అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే చాలా తక్కువ.
20శాతం పైగా కొత్త మోడళ్లు
అయితే బిలియనీర్ల సంఖ్యలో భారత్ ప్రథమ స్థానాల్లో ఉండటం, ఈ మార్కెట్ విస్తరణకు అవకాశాలను సూచిస్తోంది. వచ్చే ఏడాదిలో కార్ల తయారీ కంపెనీలు దాదాపు 20కి పైగా కొత్త మోడళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. ఆడి ఇండియా ప్రకారం, 2024లో లగ్జరీ కార్ల విక్రయాల్లో 8-10శాతం వృద్ధి నమోదు కావొచ్చు. మెర్సిడెస్ బెంజ్ సీఈఓ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ వాణిజ్య అనుకూల వాతావరణం, వినియోగదారుల సానుకూల అభిరుచులు, స్థిరమైన ఆర్థిక ఫలితాలు లగ్జరీ మార్కెట్‌కు బలాన్ని చేకూరుస్తున్నాయన్నారు.