Mahindra: రికార్డు స్థాయిలో మహీంద్రా ఎస్‌యూవీ అమ్మకాలు
టాప్ ఆటో మొబైల్ కంపెనీల్లో ఇండియాకు చెందిన దిగ్గజం మహీంద్రా & మహీంద్రాకు మంచి గుర్తింపు ఉంది. కొన్ని స్పెసిఫిక్ మోడళ్లలో వినియోగదారుల ఫేవరేట్‌గా మారిన ఈ కంపెనీ సేల్స్‌లో దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఆ సంస్థ తయారు చేసిన ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోంది. డిసెంబర్ 2023లో మహీంద్రా ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 24శాతం పెరగడం విశేషం. డిసెంబర్ 2022లో 28,445తో పోలిస్తే 35,174 యూనిట్లను విక్రయించింది. డిసెంబర్‌లో తాము మొత్తం 35,174 SUVలను విక్రయించామని, గత ఏడాదితో పోలిస్తే 24శాతం వృద్ధిని సాధించామని మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ వీజయ్ నక్రా పేర్కొన్నారు.
మహీంద్రాకు పెరుగుతున్న డిమాండ్
ఏప్రిల్ నుండి డిసెంబర్ 2023 వరకు మహీంద్రా 333,764 ఎస్‌యూవీలను విక్రయించింది. 2022లో 257,849 యూనిట్లను విక్రయించినప్పుడు 29 శాతం పెరిగింది. ఇక ఇండియాలో 333,777 ప్యాసింజర్ వాహనాలను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇండియాలో మహీంద్రా ప్రస్తుతం థార్, స్కార్పియో N, స్కార్పియో క్లాసిక్, XUV300, XUV700, బొలెరో నియో వంటి ప్రసిద్ధ మోడళ్లను విక్రయిస్తోంది. MG ZS EV, టాటా నెక్సాన్ వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతున్న మహీంద్రా XUV400 కు డిమాండ్ పెరుగుతోంది.