Maruti Suzuki: 2030 నాటికి భారతదేశంలో నాలుగు EVలను ప్రారంభించే యోచనలో మారుతి సుజుకి.. 50% మార్కెట్ వాటానే లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే,ఈ రంగంలో దేశీయ దిగ్గజం మారుతీ సుజుకీ ఆలస్యంగా ప్రవేశిస్తోంది.ప్రస్తుతం మారుతీ సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ వాహనం విటారాను సిద్ధం చేస్తోంది.
ఈ నేపథ్యంలో సంస్థ నుంచి మరో కీలకమైన అప్డేట్ వచ్చింది.
ప్రస్తుతం వెనుకబడి ఉన్నా,భవిష్యత్తులో భారతదేశం ఈవీ మార్కెట్‌లో ప్రాముఖ్యతను సంపాదించేందుకు భారీ ప్రణాళికలు రూపొందించింది.
2030 నాటికి ఈవీ రంగంలో ప్రముఖ స్థానాన్ని దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో భాగంగా,ఎఫ్‌వై30 నాటికి కనీసం 4ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
2025-2030 ఆర్థిక సంవత్సరానికి గాను తన ఉత్పత్తి వ్యూహం,మిడ్-టర్మ్ మేనేజ్మెంట్ ప్రణాళికను ప్రకటిస్తూ,నాలుగు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనున్నట్టు ధృవీకరించింది.
వివరాలు
మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కార్లు
మారుతీ సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విటారాను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది.
ఈ మోడల్‌ను ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది. 2030 నాటికి మరో మూడు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించిన ఫ్రాంక్స్ క్రాసోవర్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురాబోతున్నట్టు సంస్థ వెల్లడించింది.
అదనంగా, మారుతీ సుజుకీ ఎర్టిగా మోడల్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరిచయం చేసే అవకాశముంది.
ప్రస్తుతానికి సరసమైన ఎలక్ట్రిక్ ఎంపీవీ వాహనాలు మార్కెట్లో లేవనే విషయం దృష్టిలో ఉంచుకుని, ఎర్టిగా ఈవీకి మంచి డిమాండ్ ఉంటుందని సంస్థ అంచనా వేస్తోంది.
అయితే, సంస్థ తన ఎలక్ట్రిక్ వాహన వ్యూహం మరియు ఉత్పత్తుల గురించి పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు.
వివరాలు
మారుతీ సుజుకీ లక్ష్యం
తీవ్రంగా పెరుగుతున్న పోటీ కారణంగా మారుతీ సుజుకీ కార్ల మార్కెట్ వాటా 50% దిగువకు పడిపోయింది.
భారత ప్యాసింజర్ వాహన విభాగంలో కోల్పోయిన వాటాను తిరిగి పొందడం కంపెనీ ప్రధాన లక్ష్యం.
2030 ఆర్థిక సంవత్సరానికి గాను మార్కెట్ వాటాను తిరిగి పెంచుకోవాలని కృషి చేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా, నాలుగు ఎలక్ట్రిక్ కార్లతో సహా కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని యోచిస్తోంది.
2030 నాటికి, మారుతీ సుజుకీ తన మొత్తం అమ్మకాలలో ఐసీఈ ఆధారిత వాహనాల వాటా 60%, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల వాటా 15%, హైబ్రిడ్ వాహనాల వాటా 25% ఉండేలా వ్యూహాన్ని రూపొందించింది.