
Matter AERA: మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్ సింగిల్ ఛార్జ్‌తో 125 కి.మీ రేంజ్
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈవీ స్టార్టప్ సంస్థ మ్యాటర్, తన 'ఏరా' ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజాగా ఈ బైక్‌ను మరిన్ని నగరాల్లోకి విస్తరించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది.
వచ్చే 45 రోజుల్లో పుణె,ఢిల్లీ,చెన్నై,కోయంబత్తూరు,ముంబై, జైపూర్, సూరత్,రాజ్‌కోట్‌లలో ఈ మోడల్‌ను ప్రారంభించేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది.
కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వివిధ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌ల ద్వారా బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించింది.
కొత్త నగరాల్లో ఈ బైక్ లాంచ్‌ను మద్దతు ఇచ్చే విధంగా మ్యాటర్ ప్రత్యేకంగా "ఎక్స్‌పీరియెన్స్ హబ్‌లు" ఏర్పాటు చేస్తోంది.
ఈ హబ్‌లలో ఆసక్తి గల వ్యక్తులు బైక్‌ను పరిశీలించవచ్చు, టెస్ట్ రైడ్స్‌లో పాల్గొనవచ్చు.
వివరాలు
ఎనిమిది నగరాల్లో ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లు
అలాగే ఈ ఎలక్ట్రిక్ బైక్ తమ రోజువారీ ప్రయాణాలకు ఎలా అనుకూలంగా ఉంటుంది అనే అంశాన్ని అంచనా వేసేందుకు కూడా వీటి ఉపయోగం ఎంతో ఉంటుంది.
వాణిజ్యపరంగా పూర్తిగా మార్కెట్లోకి రాకముందే,ఈ ఎనిమిది నగరాల్లో ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లు పూర్తిగా క్రియాశీలకంగా ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
బెంగళూరులో ఈ మోడల్‌ను ఆవిష్కరించినప్పుడు వినియోగదారుల నుంచి విపరీతమైన స్పందన వచ్చిందని మ్యాటర్ వ్యవస్థాపకుడు, సీఈఓ మొహల్ లాల్ భాయ్ తెలిపారు.
ఇప్పుడైతే ఈ బైక్‌ను మరిన్ని నగరాల్లో అందుబాటులోకి తేవడం ద్వారా ఉత్పత్తిని విస్తరించడమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న రైడర్ల వివిధ అవసరాలకు అనుగుణంగా ఈ వాహనాన్ని మరింత మెరుగుపరిచేందుకు తమ ప్రయత్నం కొనసాగుతుందని ఆయన చెప్పారు.
వివరాలు
మ్యాటర్ ఏరా: లక్షణాలు, ఫీచర్లు
మ్యాటర్ ఏరా ప్రత్యేకత ఏంటంటే... ఇది మాన్యువల్ గేర్ షిఫ్టింగ్ వ్యవస్థ కలిగిన దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్.
ఇది '5000', '5000+' అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. వీటి ధరలు వరుసగా రూ.1.74 లక్షలు, రూ.1.84 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.
ఈ రెండు వేరియంట్లూ 10 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తాయి, ఇది సుమారు 13.4 బీహెచ్‌పీ పవర్‌ను అందించగలదు.
కేవలం 6 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగం చేరగల సామర్థ్యం వీటికి ఉంది. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత ఈ బైక్ 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.
వివరాలు
బైక్ రన్నింగ్ ఖర్చు.. లోమీటరుకు 25 పైసలు
ఫీచర్ల పరంగా చూస్తే, ఈ బైక్‌లో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ కన్సోల్ ఉంటుంది.
దీనిలో నావిగేషన్, మ్యూజిక్, కాల్స్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
ఈ బైక్‌ను సాధారణ 5 యాంప్స్ పవర్ సాకెట్ ద్వారా సులభంగా ఛార్జ్ చేయవచ్చు.
ఏదైనా సౌకర్యవంతమైన అవుట్‌లెట్‌లో ప్లగ్ చేయడం ద్వారా ఛార్జింగ్ చేయొచ్చు.
తయారీ సంస్థ ప్రకారం, ఈ బైక్ రన్నింగ్ ఖర్చు కేవలం ఒక కిలోమీటరుకు 25 పైసలే కావడం విశేషం!