
Satellite Based Toll System: రెండు వారాల్లో ఉపగ్రహ ఆధారిత టోల్ వ్యవస్థను అమలు చేయనున్న మోదీ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా హైవేలు,ఎక్స్‌ప్రెస్‌వేల్లో ఎదురవుతున్న సమస్యలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం టోల్ వసూలు విధానంలో కీలక మార్పులను తీసుకువస్తోంది.
ఇందులో భాగంగా టోల్ రుసుములను సగటున 50 శాతం మేర తగ్గించే దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం.
అదనంగా, ఏడాది మొత్తానికి పాస్‌లను కేవలం రూ.3,000కే అందుబాటులోకి తెచ్చే యోచన కూడా ఉందని తెలుస్తోంది.
ఈ కొత్త విధానం అన్ని జాతీయ రహదారులతోపాటు, రాష్ట్రాల పరిధిలో ఉండే ఎక్స్‌ప్రెస్‌వేలకు కూడా వర్తించనుందని తెలుస్తోంది.
వివరాలు
ఫాస్టాగ్ విధానం కొనసాగింపు
టోల్ చెల్లింపుల కోసం ప్రస్తుతం వినియోగిస్తున్న ఫాస్టాగ్ విధానమే కొనసాగించనున్నారు.
అయితే, కొత్త పాలసీ ప్రకారం టోల్ గేట్లు తెరుచుకునే, మూసే సమయంలో కొన్ని ప్రత్యేక నిబంధనలు విధించనున్నారు.
ఇప్పటివరకు టోల్ ప్లాజాల ద్వారా వసూలు చేసిన రుసుముల బదులు ఇకపై కిలోమీటర్ ప్రాతిపదికన ఫిక్స్‌డ్ ఛార్జీల రూపంలో వసూలు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
ఉదాహరణకు, ఒక కారుకు 100 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారుగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు నెలవారీ పాస్‌లే జారీ చేస్తుండగా, త్వరలోనే వార్షిక పాస్‌లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ప్రయాణికులకు మరింత లాభదాయకంగా మారనుంది.
వివరాలు
ఒప్పందాల్లో సవాళ్లు - పరిష్కారానికి చర్యలు
కొత్త టోల్ విధానం అమలులోకి రాగానే కాంట్రాక్టర్లతో ఉన్న ఒప్పందాల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇందుకు సంబంధించి తగిన పరిహారం చెల్లించేందుకు కేంద్ర రహదారి రవాణా శాఖ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దేశంలోని మూడు ప్రాంతాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా, మంచి ఫలితాలు వచ్చాయని సమాచారం.
టోల్ చెల్లించకుండా వెళ్లే వాహనాలపై కఠిన చర్యలు
కొత్త విధానం ద్వారా టోల్ చెల్లించకుండా వెళ్లే వాహనాలపై గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ క్రమంలో భారీ జరిమానాలు విధించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదే సమయంలో, టోల్ వసూళ్ల విషయంలో బ్యాంకులకు మరింత అధికారం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
జీపీఎస్ ఆధారిత టోల్ విధానం
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకారం, ప్రస్తుతం అమలులో ఉన్న ఫాస్టాగ్ విధానాన్ని మించిన శక్తివంతమైన టోల్ కలెక్షన్ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
రానున్న రోజుల్లో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని అమలు చేసి, టోల్ ప్లాజాల వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్, ఆలస్యాలను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ విధానం ద్వారా ప్రయాణించిన దూరానికి తగ్గట్లుగా ప్రయాణికుల బ్యాంక్ ఖాతా నుండి డైరెక్ట్‌గా టోల్ ఛార్జీలు డ్రా చేయబడతాయి.
గడ్కరీ ప్రకటన ప్రకారం, రానున్న 15 రోజులలో శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇది టోల్ వ్యవస్థలో మైలురాయిగా నిలవనుంది.