Tata Altroz: టెస్టింగ్ దశలో కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ స్పైడ్.. లాంచ్ ఎప్పుడంటే?
దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆల్ట్రోజ్ రేసర్ వేరియంట్‌ను పరిచయం చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ వెహికల్ గురించి ఎలాంటి ఆప్డేట్‌ను ఆ సంస్థ వెల్లడించలేదు. ఇటీవల దీని టెస్టింగ్ దశ ముగియడంతో టాటా ఆల్ట్రోజ్ రేసర్ లాంచ్ గురించి ప్రస్తుతం చర్చ మొదలైంది. తాజాగా ఆల్ట్రోజ్ టెస్ట్ కారు మహారాష్ట్ర నంబర్ ప్లేట్‌తో ఊటీలో కనిపించడం విశేషం. అయితే ఇంజిన్‌పై రేసర్ అని చేతితో రాసినట్లు ఉంది. ఇందులో మరో రెండు ఆల్ట్రోజ్ యూనిట్లు ఉన్నాయి. ఒకటి గ్రే షేడ్‌లో ఉండగా, మరొకటి పూర్తిగా నలుపురంగులో ఉంది. వీటికి కూడా మహారాష్ట్ర నంబర్ ప్లేట్లు ఉన్నాయి.
10 సెకన్లలోపే వంద కిలోమీటర్ల వేగం
టాటా నుండి అధికారికంగా ఎటువంటి సమాచారం లేనప్పటికీ, ఆల్ట్రోజ్ 2024 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రధానంగా హ్యుందాయ్ i20 N లైన్‌కు పోటీగా ఉండనుంది. ప్రస్తుతం ఉన్న మోడల్ ధర రూ.6.60 లక్షల నుంచి రూ.10.74 లక్షల మధ్యలో ఉండొచ్చు. ఆల్ట్రోజ్ రేసర్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 120 PS గరిష్ట శక్తిని, 170 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్ట్రోజ్ స్టాండర్డ్ వెర్షన్‌లో ఇప్పటికే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 10 సెకన్లలోపు 0 నుండి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.