Porsche Taycan: మంటల్లో కాలిపోయిన రూ.1.67 కోట్ల విలువైన పోర్షే టాయకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు : వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్నెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకున్న వీడియోలు తరచూ కనిపిస్తున్నాయి. కానీ కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ పూర్తిగా మంటల్లో కాలిపోవడం మాత్రం అరుదుగా జరుగుతుంది. తాజాగా రూ.1.67 కోట్లకు పైగా (ఎక్స్-షోరూమ్) విలువైన పోర్షే టాయకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ఒక్కసారిగా మంటల్లో దగ్ధమవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగినట్టు సమాచారం. రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు మొత్తం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వివరాలు
అగ్నిప్రమాదానికి గల అసలు కారణం తెలియరాలేదు
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్యా జీ అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. వీడియో ప్రారంభంలోనే ఒక స్పోర్ట్స్ కారు మంటల్లో ఉందని అతడు చెప్పాడు. కారుకి గ్రీన్ నంబర్ ప్లేట్ కనిపిస్తోందని, ఇది ఎలక్ట్రిక్ వాహనమని కూడా అతడు పేర్కొన్నాడు. చివర్లో ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్నిప్రమాదాలు ఇటీవల ఎక్కువవుతున్నాయంటూ వ్యాఖ్యానించాడు. వీడియోలో కారు దగ్గర ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. రోడ్డుకు అవతల కొంతమంది చూస్తూ నిల్చున్నారు. కారులో మంటలలో కాలిపోతున్న సమయంలో యజమాని అక్కడ లేడు. మంటలు చెలరేగిన వెంటనే యజమాని కారును వదిలేసి బయటకు వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ అగ్నిప్రమాదానికి గల అసలు కారణం ఏమిటన్నది తెలియరాలేదు.
వివరాలు
మ్యూజిక్ ప్రొడ్యూసర్ సంస్కార్ దర్యానీకి చెందిన పోర్షే టాయకాన్
అందుతున్న సమాచారం ప్రకారం,ఈ పోర్షే టాయకాన్ ఇండోర్‌కు చెందిన మ్యూజిక్ ప్రొడ్యూసర్ సంస్కార్ దర్యానీకి చెందినదిగా చెబుతున్నారు. ఆయన వద్ద ఈ టాయకాన్‌తో పాటు లాంబోర్గిని హురాకాన్ ఇవో స్పైడర్,మెక్‌లారెన్ 570ఎస్ స్పైడర్, పోర్షే 718 బాక్స్టర్ స్పైడర్, మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీఎల్ఈ 53 వంటి పలు ఖరీదైన లగ్జరీ కార్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
వివరాలు
నాలుగు వేరియంట్లలో పోర్షే టాయకాన్
భారత మార్కెట్‌లో పోర్షే టాయకాన్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. టాయకాన్, టాయకాన్ 4ఎస్, టాయకాన్ 4ఎస్ బ్లాక్ ఎడిషన్, టాయకాన్ టర్బో వేరియంట్లు ఉన్నాయి. వీటిలో అత్యంత ఖరీదైనది టాయకాన్ టర్బో, దీని ధర రూ.2.69 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ కార్ 871 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 2.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 260 కిలోమీటర్లకు పరిమితం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మంటల్లో కాలిపోతున్న రూ.1.67 కోట్ల విలువైన పోర్షే టాయకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు
ನಡುರಸ್ತೆಯಲ್ಲಿ ಹೊತ್ತಿ ಉರಿದ ದುಬಾರಿ ಕಾರ್!#porsche #Taycan #electriccar #car #fire #burned #videoviral #KannadaNews #navasamajanews pic.twitter.com/d9Qmpy5442
— navasamaja (@navasamajanews) January 15, 2026