Mini Duster: ఇండియా మార్కెట్‌పై రెనాల్ట్ ఫోకస్.. 'మినీ డస్టర్'తో కొత్త ప్లాన్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్' కొత్త తరం 'డస్టర్'ను ఆవిష్కరించడం ద్వారా భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో భారీ చర్చకు తెరలేపింది. అయితే భారత మార్కెట్‌లో తన స్థితిని బలోపేతం చేసుకునేందుకు సంస్థ కేవలం ఈ ఒక్క మోడల్‌పైనే ఆధారపడాలని భావించడం లేదు. దూకుడైన వ్యూహంతో ముందుకు సాగుతూ ప్రతేడాది కనీసం ఒక కొత్త మోడల్‌ను భారత్‌లో లాంచ్ చేయాలని రెనాల్ట్ ప్లాన్ చేస్తోంది. డస్టర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా 7-సీటర్ ఎస్‌యూవీ త్వరలోనే రానున్నదన్న ఊహాగానాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి.
Details
ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రవేశపెట్టే దిశగా అడుగులు
దీనితో పాటు, ఇప్పుడు డస్టర్‌కు 'మినీ' వెర్షన్‌ను కూడా తీసుకురావాలన్న యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌ను కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రవేశపెట్టే దిశగా రెనాల్ట్ అడుగులు వేస్తోంది. ఈ విషయంపై రెనాల్ట్ బ్రాండ్ సీఈఓ, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ 'ఫాబ్రిస్ కాంబోలివ్' ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. మినీ డస్టర్ అనేది చాలా మంచి ఆలోచన అని, ఈ మోడల్ వచ్చే అవకాశాన్ని పరోక్షంగా ధృవీకరించారన్నారు.
Details
మినీ డస్టర్ ఎలా ఉండబోతోంది?
భారత సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రెనాల్ట్‌కు ఇప్పటికే 'కైగర్' మోడల్ ఉంది. 2025 మధ్యలో కైగర్‌కు గణనీయమైన మార్పులు చేసినప్పటికీ అమ్మకాల పరంగా అది ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. నెలకు సగటున 1,000 నుంచి 1,200 యూనిట్ల అమ్మకాలకే పరిమితమవుతోంది. దీనికి ప్రధాన కారణంగా కైగర్‌కు ఉన్న క్రాస్‌ఓవర్ తరహా డిజైన్‌నే నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా భారతీయ వినియోగదారులు నిటారుగా, బాక్సీగా, గంభీరంగా కనిపించే ఎస్‌యూవీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ లోటును భర్తీ చేయడమే లక్ష్యంగా మినీ డస్టర్‌ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. డస్టర్‌కు ఉన్న రగ్గడ్ లుక్, పక్కా ఎస్‌యూవీ స్టాన్స్ గతంలో దానికి భారీ ప్రజాదరణ తీసుకొచ్చాయి. కొత్త తరం డస్టర్‌లోనూ అదే శైలి కొనసాగుతోంది.
Details
సిల్హౌట్‌తో రానున్న మినీ డస్టర్
ఇదే డిజైన్ తత్వాన్ని రాబోయే కాంపాక్ట్ ఎస్‌యూవీలోనూ అనుసరించనున్నట్లు తెలుస్తోంది. కైగర్‌లో కనిపించే కూపే తరహా రూఫ్‌లైన్ కాకుండా, మినీ డస్టర్ నిటారుగా ఉండే సిల్హౌట్‌తో రానుంది. ఇందులో రగ్గడ్ బాడీ క్లాడింగ్ పెద్ద వీల్స్ పక్కా ఎస్‌యూవీ స్టాన్స్ లాంటివి ఉండనున్నట్లు అంచనాలు ఉన్నాయి.
Details
ఇంజిన్, గేర్‌బాక్స్ వివరాలు
పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, ప్రస్తుతం కైగర్‌లో ఉపయోగిస్తున్న 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌నే మినీ డస్టర్‌లోనూ వినియోగించే అవకాశం ఉంది. దీనికి మాన్యువల్ గేర్‌బాక్స్, సీవీటీ ఆటోమేటిక్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన పేరు ఇంకా ఖరారు కాలేదు. అలాగే ఇది మార్కెట్‌లోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశముంది. ముందుగా 7-సీటర్ డస్టర్‌ను విడుదల చేసిన తర్వాతే మినీ డస్టర్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. అందువల్ల దీని లాంచ్ టైమ్‌లైన్ 2027-28 మధ్యలో ఉండొచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.
Details
రెనాల్ట్‌కు రెండో కాంపాక్ట్ ఎస్‌యూవీ అవసరమేనా?
ప్రస్తుతం ఒకే బ్రాండ్ నుంచి ఒకే సెగ్మెంట్‌లో ఒకటి కంటే ఎక్కువ మోడల్స్ ఉండటం సాధారణమైంది. ఉదాహరణకు, మారుతీ సుజుకీ - బ్రెజ్జా, ఫ్రాంక్స్ కియా మోటార్స్ - సోనెట్, సైరోస్ లాంటివి వేర్వేరు కస్టమర్ వర్గాలను ఆకట్టుకుంటున్నాయి. మహీంద్రా కూడా తన రాబోయే 'ఎన్‌యూ' ప్లాట్‌ఫామ్ ఆధారిత ఎస్‌యూవీలతో ఇదే వ్యూహాన్ని అనుసరించనుంది. అంతేకాదు 2025లో జీఎస్టీ రేట్ల సవరణ తర్వాత కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్‌పై తయారీ సంస్థలతో పాటు వినియోగదారుల్లోనూ మళ్లీ ఆసక్తి పెరిగింది. ఈ సెగ్మెంట్‌లో ఉన్న భారీ డిమాండ్‌ను ఏ కంపెనీ కూడా విస్మరించాలనుకోవడం లేదు. అయితే ఈ తీవ్రమైన పోటీలో విజయం సాధించాలంటే ధర కీలక పాత్ర పోషించనుంది.