Micro Electric Car : రూ. 4.79 లక్షలకే మైక్రో ఈవీ..చిన్న ఫ్యామిలీకి సరిపోయే బుజ్జి కారు!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాచుర్యం రోజురోజుకూ పెరుగుతోంది. టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ మోటార్ వంటి ప్రముఖ కంపెనీలతో పాటు, ముంబైకి చెందిన ఈవీ స్టార్టప్ పీఎంవీ ఎలక్ట్రిక్ రంగంలో తన మార్కు చూపిస్తోంది. ఈ కంపెనీ 2022లో 'EaS-E' అనే మైక్రో ఎలక్ట్రిక్ కార్ ను ప్రవేశపెట్టింది. తక్కువ ధర, ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ కారు ఇప్పటికే భారత వినియోగదారుల్లో ఆసక్తిని పెంచింది. పీఎంవీ ఈవీ కోసం బుకింగ్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ను ఓపెన్ చేసింది. కేవలం రూ. 2,000 చెల్లించి ఈ కారును ముందుగా బుక్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది. అయితే ఈ కారును మార్కెట్‌లో విడుదల చేయడం ఆలస్యం కానుంది.
ప్రీమియం బైక్ కంటే తక్కువ ధర
2023 మూడో త్రైమాసికంలో డెలివరీలు ప్రారంభిస్తామని ప్రకటించినా, అవి ఇంకా ప్రారంభం కాలేదు. అయితే 2025 నాటికి ఈ కారును వినియోగదారులకు అందజేయనుంది. పీఎంవీ EaS-E మైక్రో ఎలక్ట్రిక్ కారును రూ. 4.79 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ప్రవేశపెట్టారు. ఇది ప్రీమియం బైక్ కంటే తక్కువ ధరగా అందుబాటులో ఉండటం గమనార్హం. రాయల్ బీజ్, డీప్ గ్రీన్, స్పార్కిల్ సిల్వర్, బ్రిలియంట్ వైట్, మెజెస్టిక్ బ్లూ, వింటేజ్ బ్రౌన్ వంటి వివిధ ఆకర్షణీయమైన రంగులలో ఈ కారు లభిస్తుంది. ఈ కారులో 10 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు మూడు రేంజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఛార్జింగ్ కు 4 గంటలే సమయం
కారు పూర్తిగా ఛార్జ్ కావడానికి 15A సాకెట్ ఉపయోగించి 3-4 గంటలు మాత్రమే పడుతుంది. కేవలం 5 సెకన్లలో 0-40 కిమీ వేగాన్ని అందుకోవడమే కాకుండా, గరిష్టంగా 70 కేఎంపీహెచ్ వేగాన్ని కలిగి ఉంటుంది. ఈ కారు ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎల్‌సీడీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, సీట్‌బెల్ట్‌లు, క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్, రియర్ వ్యూ కెమెరా వంటి సదుపాయాలను అందించారు. ఇది 2 సీటర్ వాహనం కావడంతో చిన్న కుటుంబాలకు అనువుగా ఉంటుంది.