TATA EVs: ఇక కొత్త బ్రాండ్‌తో దర్శనమివ్వనున్న టాటా విద్యుత్ వాహనాలు
విద్యుత్ వాహనాలకు మార్కెట్లో రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి టాటా మోటర్స్ నుంచి విద్యుత్ వాహనాలను కొత్త బ్రాండ్ తో తీసుకురానున్నట్లు ప్రకటించింది. వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు టాటా మోటర్స్ స్పష్టం చేసింది. విద్యుత్ వాహనాలను 'టాటా.ఈవీ (TATA.ev)' పేరిట తీసుకురానున్నట్లు టాటా మోటర్స్ వెల్లడించింది. 2026 నాటికి పది రకాల విద్యుత్ వాహనాలను విడుదల చేయడమే కంపెనీ ధ్యేయమని పేర్కొంది.
విద్యుత్ వాహన వ్యాపారానికి కొత్త గుర్తింపు
టాటా ఈవీ అనే కొత్త బ్రాండ్ తమ విద్యుత్ వాహన వ్యాపారానికి కొత్త గుర్తింపునిస్తుందని, దీంతో తాము కొత్త శకంలోని అడుగుపెడుతున్నట్లు 'టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ' మార్కెటింగ్ విభాగాధిపతి వివేక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇప్పటికే టాటా మోటర్స్ కు అనుబంధ సంస్థ ఉన్న టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ 2026 నాటికి రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2030 నాటికి వాహన విక్రయాల్లో సగం వాటా ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని, దేశ వ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది.