
Tesla India: అంచనాల కంటే తక్కువ.. జూలై నుండి దాదాపు 600 ఆర్డర్లు
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం టెస్లా(Tesla) కార్లకు భారత మార్కెట్లో ఊహించినంత స్పందన లభించలేదు. ఇప్పటివరకు కేవలం 600 బుకింగ్స్ మాత్రమే నమోదైనట్లు బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో వెల్లడించింది. సాధారణంగా టెస్లా ప్రపంచవ్యాప్తంగా నాలుగు గంటల్లోనే ఇన్ని కార్లను విక్రయిస్తుంది. ఈ సంఖ్య కంపెనీ అంచనాలకు చాలా తక్కువగా ఉందని, దీనిపై అవగాహన కలిగిన వర్గాలు బ్లూమ్‌బెర్గ్‌కు తెలిపారు. బుకింగ్స్ ఆధారంగా ఈ ఏడాది టెస్లా భారత్‌లో 350 నుంచి 500 వరకు వాహనాలను రవాణా చేయాలని యోచిస్తోంది. తొలిబ్యాచ్ షాంఘై నుంచి ఈ నెలలోనే భారత్‌కు చేరుకోవచ్చని అంచనా.అయితే ఈ వాహనాల డెలివరీలు ముంబయి,ఢిల్లీ,పుణే, గురుగ్రామ్ నగరాలకు మాత్రమే పరిమితం చేయాలని కంపెనీ ప్రణాళిక వేసింది.
వివరాలు
టెస్లా మోడల్ వై ధర దాదాపు రూ.60 లక్షలు
పూర్తిస్థాయి చెల్లింపు తర్వాతే వినియోగదారులకు కార్లను అందించనుంది. ఇదిలా ఉంటే, బ్లూమ్‌బెర్గ్ రిపోర్టుపై టెస్లా అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. భారత మార్కెట్లో తొలుత మోడల్-3 కారును ప్రవేశపెట్టాలన్న టెస్లా ప్రణాళిక 100 శాతం దిగుమతి సుంకాల కారణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత "మోడల్ వై" (Model Y) తో ఇక్కడ అడుగు పెట్టేందుకు నిర్ణయించుకొని బుకింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం భారత్‌లో సగటు ఎలక్ట్రిక్ కార్ల ధర సుమారు రూ.22 లక్షలుగా ఉండగా, టెస్లా మోడల్ వై ధర దాదాపు రూ.60 లక్షలకు చేరుకుంటోంది. ఇక్కడి మార్కెట్లో బేస్ వెర్షన్ RWD 'మోడల్ వై' ధర రూ.61.07 లక్షలుగా (ఆన్‌రోడ్) నిర్ణయించగా, లాంగ్-రేంజ్ వెర్షన్ రూ.69.15 లక్షలుగా ఉంది.
వివరాలు
అమెరికా,కెనడా మార్కెట్లలో మోడల్ వై
అమెరికాలో బేస్ వెర్షన్ ధర 44,990 డాలర్లు (సుమారు రూ.38.63 లక్షలు), చైనాలో 2,63,500 యువాన్లు (రూ.31.57 లక్షలు),జర్మనీలో 45,970 యూరోలు (రూ.46.09 లక్షలు)గా ఉంది. దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చులు కారణంగా భారత్‌లో ఈ ధరలు మరింత పెరిగాయి. ఇటీవల భారత రోడ్లపై "మోడల్ వై"ను పరీక్షించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ముంబయి-పుణే జాతీయ రహదారిపై కనిపించిన ఈ వాహనం చూసి పలువురు ఆకర్షితులయ్యారు. ఇది పూర్తిగా అప్‌డేట్ చేసిన మోడల్ వై కారుగా నిపుణులు గుర్తించారు. దీని కోడ్ నేమ్ "జునిపెర్". సాధారణ మోడల్ వైతో పోలిస్తే ఈ వెర్షన్‌లో మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా, కెనడా మార్కెట్లలో ఈ వాహనాలను విక్రయిస్తున్నారు.