Loading...
Toyota Fortuner: కొత్త లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్‌.. 2027 మోడల్‌లో అదిరిపోయే మార్పులు!
కొత్త లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్‌.. 2027 మోడల్‌లో అదిరిపోయే మార్పులు!

Toyota Fortuner: కొత్త లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్‌.. 2027 మోడల్‌లో అదిరిపోయే మార్పులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2026
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఫుల్‌సైజ్‌ ఎస్‌యూవీ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టయోటా ఫార్చ్యూనర్‌ సరికొత్త రూపంలో రాబోతోంది. నెక్ట్స్‌ జనరేషన్‌ టయోటా ఫార్చ్యూనర్‌ (2027 Toyota Fortuner) అర్జెంటీనాలో రోడ్లపై పరీక్షలు జరుపుకుంటూ కెమెరాలకు చిక్కింది. పూర్తిగా క్యామోఫ్లేజ్‌తో కప్పి ఉన్న ఈ ఎస్‌యూవీ స్పై చిత్రాలు ప్రస్తుతం వాహన ప్రియుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. దక్షిణ అమెరికా దేశాల్లో ఈ ఏడు సీట్ల ఎస్‌యూవీని 'ఎస్‌డబ్ల్యూ4' పేరుతో విక్రయిస్తున్నారు. ఫార్చ్యూనర్‌ తన సంప్రదాయ బాడీ-ఆన్‌-ఫ్రేమ్‌ నిర్మాణాన్ని కొనసాగిస్తూనే.. డిజైన్‌, ఫీచర్ల పరంగా భారీ మార్పులతో రాబోతున్నట్లు ఈ చిత్రాలు సూచిస్తున్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో టయోటా ఫార్చ్యూనర్‌కు మంచి ఆదరణ ఉంది.

వివరాలు

తన

రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ఎక్కువగా ఇష్టపడే ఈ ఎస్‌యూవీని చాలామంది స్టేటస్‌ సింబల్‌గా భావిస్తారు.

ధర రూ.50 లక్షలు దాటినా.. పోటీగా కొత్త కార్లు మార్కెట్లోకి వస్తున్నా ఫార్చ్యూనర్‌ క్రేజ్‌ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త తరం మోడల్‌ రాకపై వాహన ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

టెస్టింగ్‌ సమయంలో కనిపించిన కొత్త ఫార్చ్యూనర్‌లో ప్రస్తుత మోడల్‌కు ప్రత్యేక గుర్తింపుగా ఉన్న ఎత్తైన బోనెట్‌, నిటారుగా ఉండే స్టాన్స్‌, విశాలమైన గ్లాస్‌ ఏరియాను టయోటా కొనసాగిస్తోంది. ఆధునిక క్రాసోవర్‌ కార్ల తరహాలో ఎస్‌యూవీ ఎత్తును తగ్గించి సన్నగా మార్చే ప్రయత్నం చేయడం లేదు. బదులుగా ముందు భాగానికి మరింత పదునైన, ఆధునిక రూపాన్ని అందిస్తోంది.

వివరాలు

2027 టయోటా ఫార్చ్యూనర్‌.. సరికొత్త డిజైన్

కొత్త మోడల్‌లో మార్పులు చేసిన హెడ్‌లైట్లు, వెడల్పాటి మెష్‌ స్టైల్‌ గ్రిల్‌, కొత్త డిజైన్‌ ఫ్రంట్‌ బంపర్‌ ఉండనున్నాయి.

గతంలో బయటకు వచ్చిన ప్రోటోటైప్‌ చిత్రాల ప్రకారం వెనుకవైపు కొత్త టెయిల్‌ ల్యాంప్స్‌, మార్పులు చేసిన టెయిల్‌గేట్‌ డిజైన్‌, సరికొత్త అల్లాయ్‌ వీల్స్‌ కూడా కనిపించనున్నాయి.

బాహ్య రూపంలో అనేక మార్పులు చేసినప్పటికీ.. సాంకేతికంగా ఈ ఎస్‌యూవీ హైలక్స్‌ పికప్‌ ట్రక్కుతో తన అనుబంధాన్ని కొనసాగించనుంది.

భారత్‌ వంటి మార్కెట్లలో వినియోగదారులు కోరుకునే దృఢమైన నిర్మాణం, ఎత్తైన డ్రైవింగ్‌ పొజిషన్‌ కోసం పాత ఐఎంవీ ల్యాడర్‌-ఫ్రేమ్‌ ఆర్కిటెక్చర్‌నే ఉపయోగిస్తున్నారు.

కారు మన్నిక, బరువులను లాగే సామర్థ్యం,కఠినమైన రహదారులపై ప్రయాణించే సామర్థ్యానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ముందు, వెనుక భాగాలకు ఆధునిక రూపాన్ని అందించనున్నారు.

ADVERTISEMENT

వివరాలు

కొత్త క్యాబిన్‌.. అడాస్‌ భద్రతా ఫీచర్లు

బాహ్య డిజైన్‌తో పాటు 2027 టయోటా ఫార్చ్యూనర్‌ ఇంటీరియర్‌లోనూ భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

కొత్త స్టీరింగ్‌ వీల్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, అప్‌డేట్‌ చేసిన ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ అందించనున్నారు.

తర్వాతి తరం హైలక్స్‌లో ఉండే కొన్ని ఫీచర్లతో పాటు.. ఉత్తర అమెరికా మార్కెట్లో విక్రయించే టయోటా టకోమా నుంచి కొన్ని ప్రీమియం పరికరాలను కూడా ఇందులో చేర్చనున్నట్లు సమాచారం.

భద్రత విషయంలోనూ టయోటా కీలక మార్పులు చేయనుంది. కొత్త ఫార్చ్యూనర్‌లో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ (ADAS) ఫీచర్లను అందించే అవకాశం ఉంది.

అయితే ఇందులో ఎలాంటి అడాస్‌ ఫీచర్లు ఉంటాయి? భారత మార్కెట్లో విడుదలయ్యే వేరియంట్లలో వేటిని అందిస్తారు? అనే వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

ADVERTISEMENT

వివరాలు

భారత్‌లో ఇంజిన్‌ ఆప్షన్లు ఎలా ఉండనున్నాయి?

భారత మార్కెట్‌లో కొత్త ఫార్చ్యూనర్‌ అందరికీ సుపరిచితమైన 2.8 లీటర్‌ టర్బో డీజిల్‌ ఇంజిన్‌తోనే వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ ఇంజిన్‌ 204 హెచ్‌పీ పవర్‌, గరిష్ఠంగా 500 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీనికి 6 స్పీడ్‌ మాన్యువల్‌, 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు లభించనున్నాయి.

మరోవైపు కఠినతరమవుతున్న కాలుష్య నిబంధనల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా 2.7 లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని టయోటా భావిస్తున్నట్లు సమాచారం.

ఈ ఇంజిన్‌ 166 హెచ్‌పీ పవర్‌, 245 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. అయితే పెట్రోల్‌ ఇంజిన్‌ అందించే విషయంపై కంపెనీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

వివరాలు

డిసెంబర్‌ 1న గ్లోబల్‌ లాంచ్‌.. భారత్‌లో ఎప్పుడంటే?

నెక్ట్స్‌ జనరేషన్‌ టయోటా ఫార్చ్యూనర్‌ 2026 డిసెంబర్‌ 1న దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయంగా ఆవిష్కృతం కానుంది.

భారత మార్కెట్లోకి 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దేశీయంగా లాంచ్‌ తేదీపై టయోటా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

కొత్త క్యాబిన్‌, ఆధునిక డిజైన్‌, అడాస్‌ భద్రతా ఫీచర్లతో 2027 ఫార్చ్యూనర్‌ రానుండటంతో ఎస్‌యూవీ ప్రియుల్లో ఆసక్తి పెరుగుతోంది.

ADVERTISEMENT