LOADING...
Toyota Hyryder: టయోటా హైరైడర్.. ఇన్నోవాను మొదటిసారి దాటి రికార్డు!
టయోటా హైరైడర్.. ఇన్నోవాను మొదటిసారి దాటి రికార్డు!

Toyota Hyryder: టయోటా హైరైడర్.. ఇన్నోవాను మొదటిసారి దాటి రికార్డు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

టయోటా ఇండియాలో ఊహించని మార్పు చోటు చేసుకుంది. కంపెనీకి ప్రముఖ మోడల్‌గా నిలిచే ఇన్నోవా హైక్రాస్, క్రిస్టా అమ్మకాలకంటే అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మొదటిసారి ఎక్కువ అమ్మకలు సాధించింది. అక్టోబర్ 2025లో ఈ మిడ్సైజ్ SUV తన అత్యధికంగా 11,555 యూనిట్లు అమ్ముడుపోయి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సంఖ్య, ఆ నెలలో టయోటా పంపిణీ చేసిన మొత్తం 33,809 యుటిలిటీ వాహనాల్లో 34% వాటా. దీంతో టయోటా మార్కెట్ వ్యూహంలో గమనించదగ్గ మార్పు చోటు చేసుకున్నట్లైంది.

వివరాలు 

హైరైడర్ అమ్మకాల బలం 

టయోటా కిర్లోస్కర్ మోటార్ అక్టోబర్ 2025లో అత్యధికంగా 40,247 ప్యాసింజర్ వాహనాలు విక్రయించిందని వెల్లడించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 43% వృద్ధి. అయితే మోడల్‌వైస్ గణాంకాలు చూస్తే, హైరైడర్ అమ్మకాలు మొదటిసారి ఇన్నోవాను దాటడం విశేషం. హైక్రాస్, క్రిస్టా రెండింటి కలిపిన అమ్మకాల కంటే 466 యూనిట్లు ఎక్కువగా హైరైడర్ డెలివరీ అయ్యింది.

వివరాలు 

అమ్మకాల్లో కొత్త ఎత్తులు 

ఇది మాత్రమే కాదు, హైరైడర్ తన గత రికార్డు అయిన ఆగస్టు 2025లో అమ్ముడైన 9,100 యూనిట్లను కూడా అధిగమించింది. అక్టోబర్ 2022లో ఉన్న 5,449 యూనిట్లతో పోలిస్తే 112% భారీ వృద్ధి సాధించింది. దేశీయ మార్కెట్‌లో ఈ SUVకు డిమాండ్ భారీగా పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం. ఇన్నోవా మోడళ్లతో కలిపి వీటి అమ్మకాలు టయోటా యుటిలిటీ వాహనాల మొత్తం అమ్మకాలలో 67% వాటా సాధించాయి.

వివరాలు 

7 నెలల్లో 56,000 యూనిట్లు 

FY2024-25 మొదటి ఏడు నెలల్లో హైరైడర్ 56,000 యూనిట్లు అమ్ముడైంది. ఇది 57% వార్షిక వృద్ధి. మిడ్సైజ్ SUV సెగ్మెంట్‌కే గట్టి పోటీ ఉన్నా, ఈ మోడల్‌కు డిమాండ్ తగ్గలేదు. ముఖ్యంగా స్ట్రాంగ్-హైబ్రిడ్ ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో టయోటాకు 80% వాటా ఉండటం హైరైడర్‌కు అదనపు బలం.

వివరాలు 

త్వరలో 2 లక్షల మార్క్ దాటి రానున్న హైరైడర్ 

అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మొత్తం అమ్మకాల్లో 2 లక్షల యూనిట్ల మైలురాయికి ఇక దాదాపు 11,000 యూనిట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుత అమ్మకాల వేగం చూస్తుంటే నవంబర్ చివరికైనా లేదా డిసెంబర్ మధ్యలోనైనా ఈ టార్గెట్ చేరుకోనుంది. అధిక మైలేజ్ ఇచ్చే స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్, బ్రేక్ ఎనర్జీ రికూపరేషన్, ఐడ్లింగ్ టైంలో ఆటో ఇంజిన్ షట్-ఆఫ్ వంటి ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. హైరైడర్ గరిష్టంగా 27.97 కిమీ/లీటర్ మైలేజ్ అందించడం కూడా ప్రధాన హైలైట్‌గానే నిలుస్తోంది.