
Rapido,Uber,Ola: ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలతో.. రద్దీ సమయాల్లో చార్జీలు పెంచుకునేందుకు ఉబెర్,రాపిడో,ఓలాకు గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
యాప్ ఆధారితంగా ట్యాక్సీ సేవలు అందిస్తున్న ఓలా, ఉబర్, రాపిడో వంటి రైడ్ హైలింగ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న పీక్ అవర్స్‌లో సేవల రేట్లు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు, ట్రాఫిక్ తక్కువగా ఉన్న సమయంలో బేస్ ఛార్జీలపై 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేసుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో ట్రాఫిక్ అత్యధికంగా ఉన్న సమయంలో అయితే కంపెనీలు రేట్లను 200 శాతం వరకు పెంచుకునే వీలును కల్పించింది.
వివరాలు
రైడ్ రద్దుపై ఫైన్లు: డ్రైవర్లకు, ప్రయాణికులకు సమానంగా వర్తింపు
ఈమేరకు మోటార్ వెహికల్ అగ్రిగేటర్లకు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సవరణ మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే, మూడు కిలోమీటర్లలోపు ప్రయాణాలకు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని స్పష్టమైన నిబంధనను కూడా ఈ మార్గదర్శకాలలో చేర్చారు. ఎలాంటి కారణం లేకుండా డ్రైవర్ రైడ్‌ను రద్దు చేస్తే, మొత్తం ప్రయాణ చార్జీలో 10శాతం(కానీ ₹100ను మించకుండా)జరిమానా విధించనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈపెనాల్టీ డ్రైవర్,అగ్రిగేటర్ ప్లాట్ ఫామ్ చెరి సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా,సరైన కారణం లేకుండా ప్రయాణికుడు రైడ్‌ను క్యాన్సిల్ చేస్తే కూడా ఇదే రకం జరిమానా అతనిపై విధించనున్నారు. మూడు నెలల వ్యవధిలో ఈ మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని రవాణా శాఖ సూచించింది.
వివరాలు
భద్రతకు అధిక ప్రాముఖ్యత: ట్రాకింగ్ పరికరాలు తప్పనిసరి
క్యాబ్ సంస్థల ద్వారా రవాణా సేవలు అందిస్తున్న వాహనాల్లో తప్పనిసరిగా వాహన లొకేషన్, ట్రాకింగ్ పరికరాలను అమర్చాల్సిందేనని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఈ డేటా ఫీడ్‌ను ఆయా సంస్థలతో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లకు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర సందర్భాల్లో వేగవంతమైన స్పందనకు ఇది ఉపయోగపడుతుందని కేంద్రం వివరించింది.
వివరాలు
ప్రైవేట్ బైకులకు వాడకానికి అనుమతి: బైక్ ట్యాక్సీలపై నిషేధానికి విరామం
ఇటీవలి కాలంలో కర్ణాటక హైకోర్టు బైక్ ట్యాక్సీలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో, ప్రైవేట్ బైకులను ఓలా,ఉబర్,ర్యాపిడో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వాడుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. చట్టంలో బైక్ ట్యాక్సీల గురించి స్పష్టత లేకపోవడం వల్లే ఈ నిషేధం వచ్చినట్టు గుర్తించారు. ఈ నిషేధంతో గిగ్ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వారికి ఊరట కలిగించనుంది. ఇకపై కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో బైక్ ట్యాక్సీలపై ఉన్న నిషేధం తొలగిపోవచ్చని అంచనా. మరోవైపు, ట్యాక్సీ సంస్థలు తమ రేట్లను పెంచేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ప్రయాణికులపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు హర్షంతో స్వాగతిస్తున్నారు.