IDV: ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అంటే ఏంటి? అది ఎలా నిర్ణయించబడుతుంది?
మీరు సరైన కారు బీమా తీసుకోకపోతే భవిష్యత్తులో కలిగే ప్రమాదాలు, బ్రేక్‌డౌన్‌లు లేదా మరమ్మత్తులు మిమ్మల్ని ఆర్థికంగా భారీగా దెబ్బతీస్తాయి. ఈ సమస్యల నుంచి రక్షించుకునేందుకు సమగ్రమైన కారు బీమా పొందడం ఉత్తమం, ముఖ్యంగా మంచి ప్రీమియంతో. అవసరమైతే కచ్చితంగా రైడర్లను జోడించడం కూడా బాగుంటుంది. అయితే కారు బీమా తీసుకునే ముందు IDV(ఇన్‌షుర్డ్ డిక్లేర్డ్ వాల్యూ) గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. సాధారణంగా ఐడీవీ అనేది మీ వాహనం ప్రస్తుత మార్కెట్ విలువ. బీమా కంపెనీ చెల్లించగల గరిష్ట మొత్తాన్ని ఐడీవీ అంటారు.
వాహన వయస్సు పెరిగేకొద్ది.. బీమా ప్రీమియం తగ్గుతుంది
పాలసీ మద్దతు కాలంలో మీ వాహనానికి పూర్తిగా నష్టం కలిగినా, చోరీ అయినా, లేదా మరమ్మత్తులకు భారీగా ఖర్చు అయినా, మీరు క్లెయిమ్ చేయగలిగే మొత్తం పాలసీలో పేర్కొన్న సరిహద్దులోనే ఉంటుంది. IRDA(భారత బీమా నియంత్రణ,అభివృద్ధి సంస్థ) నిబంధనల ప్రకారం, వాహనం గరిష్టంగా ప్రకటించిన విలువ, దాని ఎక్స్-షోరూమ్ ధరలో 95% వరకు ఉండాలి. అయితే, వాహనం కొనుగోలు చేసిన ఆరు నెలల తర్వాత దాని విలువ 5% తగ్గుతుంది. వాహన వయస్సు పెరిగేకొద్ది దాని ఐడీవీ తగ్గుతూ ఉంటుంది, దీని ఆధారంగా బీమా ప్రీమియం కూడా తగ్గుతుంది.