BYD: తెలంగాణలో చైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు.. కీలకంగా మారనున్న కేంద్రం నిర్ణయం
భారతదేశంలోని ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో భారత్‌తో పాటు అంతర్జాతీయ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే చైనా దిగ్గజ ఆటోమోబైల్ ఫ్యాక్టరీ బీవైడీ (BYD), తెలంగాణను పెట్టుబడి కేంద్రంగా ఎంచుకునేందుకు చర్యలు వేగవంతం చేసింది. దేశంలోనే అతిపెద్ద ఈవీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (MEIL)సంస్థతో కలిసి సంయుక్తంగా ఒక బిలియన్ డాలర్లు (భారత కరెన్సీ మేరకు రూ. 8 వేల కోట్ల) పెట్టుబడులతో ప్లాంట్ ఏర్పాటుకు బీవైడీ ఉవ్విళ్లూరుతోంది. బీవైడీ ప్రతిపాదనలకు కేంద్రం నుంచి ఇంకా నిర్ణయం వెలువడలేదు.
బీవైడీకి కేంద్రం అనుమతి కష్టమే అంటున్న నిపుణులు
చైనాతో భద్రతాపరమైన సమస్యలు తలెత్తున్న నేపథ్యంలో బీవైడీ ప్రతిపాదనలకు కేంద్రం అనుమతించేందుకు అవకాశాలు తక్కువేనని మార్కెట్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. చైనా కంపెనీ భారత మార్కెట్లోకి అడుగుపెడితే అధిపత్యం ప్రదర్శించే ప్రమాదం లేకపోలేదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఎంఈఐఎల్ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 150 ఎకరాల భూమిని పొందింది.