Xiaomi Car: షావోమి ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే!
షావోమీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. తాజాగా షావోమి కంపెనీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నారు. షావోమి ఎస్‌యూ 7 పేరుతో ఈ కారును లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే షావోమీ కార్లకు సంబంధించి లైసెన్స్ కోసం చైనాలో దరఖాస్తు చేసుకుంది. 'బీజింగ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్' సహకారంతో ఈ కార్లను తయారు చేస్తోంది. తాజాగా షావోమీ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించింది. షావోమి ఎస్‌యూ 7 సెడాన్ విభాగంలో వస్తోంది. కారు వీల్ బేస్ 3000 ఎంఎం. ఈ కారులో లైడర్ సెన్సర్ కూడా ఉంది.
షావోమీ ఎస్‌యూ 7లో 'ఫేస్ రికగ్నిషన్ అన్ లాకింగ్' ఫీచర్
ఈ క్రమంలో 'ఫేస్ రికగ్నిషన్ అన్ లాకింగ్' ఫీచర్ ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. .అంటే స్మార్ట్ ఫోన్ లో ఎలా అయితే మొహం చూపించి అన్ లాక్ చేసుకుంటున్నామో, అదే విధంగా కారు కీ లేకుండా అన్ లాక్ చేసుకోవచ్చు. ఈ కారులో 220 కిలోవాట్ మోటార్ తో కూడిన రియల్ వీల్ డ్రైవ్, 495 కిలోవాట్ మ్యాగ్జిమమ్ పవర్ కూడిన రెండు బ్యాటరీలు ఉండనున్నాయి. షావోమి ఎస్‌యూ 7, ఎస్‌యూ 7 ప్రో, ఎస్‌యూ 7 మ్యాక్స్ వేరియంట్స్ లో ఈ కారు రానుంది. ఈ కారును డిసెంబర్‌లో లాంచ్ చేసి, 2024 ఫిబ్రవరి నుంచి సేల్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.