Page Loader
GCCs: రహేజా మైండ్‌స్పేస్‌లో 'నేషన్‌వైడ్‌ మ్యూచువల్‌ ఇన్సూరెన్స్‌'.. హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీలో 'కాస్ట్‌కో' 
హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీలో 'కాస్ట్‌కో'

GCCs: రహేజా మైండ్‌స్పేస్‌లో 'నేషన్‌వైడ్‌ మ్యూచువల్‌ ఇన్సూరెన్స్‌'.. హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీలో 'కాస్ట్‌కో' 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2025
08:11 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ నగరం ఐటీ, ఐటీఈఎస్‌ రంగాల్లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఆకర్షణలో అగ్రగామిగా కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన రెండు ప్రముఖ సంస్థలు.. నేషన్‌వైడ్‌ మ్యూచువల్‌ ఇన్సూరెన్స్‌, కాస్ట్‌కో ఈ నగరంలో తమ గ్లోబల్‌ సెంటర్లను స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలకు అవసరమైన ఐటీ సేవల కోసం ఈ రెండు సంస్థలు హైదరాబాద్‌ జీసీసీలను ఏర్పాటుచేయాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థలు తగిన భవనాలను ఎంపికచేసి, అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నట్లు తెలిసింది.

వివరాలు 

నేషన్‌వైడ్‌ మ్యూచువల్‌ ఇన్సూరెన్స్‌ - బీమా రంగంలో మరో పెద్ద అడుగు 

ఇది సుమారు 90 ఏళ్లుగా అమెరికాలో బీమా,ఆర్థిక సేవల విభాగాల్లో సేవలందిస్తున్న ప్రముఖ సంస్థ. ప్రపంచంలో అతిపెద్ద బీమా సంస్థలలో ఈ కంపెనీ ఒకటి. 2026 ప్రారంభంలో హైదరాబాద్‌లో తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించాలన్న యోచనలో సంస్థ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రారంభ దశలోనే ఈ కేంద్రం 500 నుంచి 1000 ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సంస్థకు యునైటెడ్‌ స్టేట్స్‌లోని కొలంబస్, డెస్‌ మోయిన్స్‌, స్కాట్స్‌డేల్‌ నగరాలలో కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, బీమా రంగాలకు చెందిన మాస్‌మ్యూచువల్‌, వాన్‌గార్డ్‌, వెల్స్‌ ఫార్గో లాంటి సంస్థలు తమ తమ జీసీసీలను విజయవంతంగా నడుపుతున్న సంగతి గమనించదగినది.

వివరాలు 

కాస్ట్‌కో హోల్‌సేల్‌ కార్పొరేషన్‌ - రిటెయిల్‌ రంగంలో కొత్త ఆరంభం 

అమెరికాకు చెందిన ప్రముఖ రిటెయిల్‌ దిగ్గజం కాస్ట్‌కో హోల్‌సేల్‌ కార్ప్‌ కూడా తన తొలి గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో స్థాపించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ కేంద్రం ద్వారా ఐటీ సేవలతో పాటు, సాంకేతిక పరిశోధన, అభివృద్ధి.. అంతర్జాతీయ బృందాలకు అవసరమైన మద్దతును కూడా ఈ సెంటర్‌ అందించనుంది. ప్రారంభ దశలోనే సుమారు 1,000 మంది నిపుణులకు ఉద్యోగాలు లభించే అవకాశముంది. తరువాతి దశల్లో ఉద్యోగాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రిటెయిల్‌ రంగంలో కాస్ట్‌కో లాంటి దిగ్గజ సంస్థ రాకతో, హైదరాబాద్‌ జీసీసీలకు ప్రధాన కేంద్రంగా మరింత బలోపేతం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

ఇంకా మరిన్ని జీసీసీలు హైదరాబాద్‌లోకి 

హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు ఆసక్తి చూపుతున్న సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్థానిక పరిశ్రమ వర్గాల సమాచారం మేరకు, ఆర్‌ఎంజడ్‌ ఎకోవరల్డ్‌, బాగ్‌మేన్‌ కేపిటల్‌, ఎంబసీ టెక్‌ విలేజ్‌ వంటి కంపెనీలు కూడా త్వరలో తమ జీసీసీలను హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.