
Donald Trump: భారత మందులపై 200% పన్ను..? ట్రంప్ హెచ్చరికలతో ఇండియా ఫార్మా అసహనం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన హెచ్చరికలతో దేశీయ ఫార్మా రంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది. భారతదేశం నుంచి దిగుమతి అయ్యే మందులపై 200శాతం పన్నులు విధిస్తాం, ఈ వడ్డింపునకు సిద్ధంగా ఉండండి" అనే ఆయన వ్యాఖ్యలపై దేశీయ పరిశ్రమ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ వైఖరి స్థిరంగా లేకుండా, అనూహ్య వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా భారీ పన్నులు విధిస్తే, భారత ఔషధ పరిశ్రమే కాకుండా అమెరికా ప్రజలకే పెద్ద నష్టం జరుగుతుందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అధిక పన్నుల భారం వల్ల మందుల ధరలు పెరిగి, ఆరోగ్య బీమా ఖర్చులు అమెరికన్లకు మోత మోగించవచ్చని అవి అంటున్నాయి.
Details
అమల్లోకి రావడం అసాధ్యమే
ఇంతవరకు 10-20 శాతం అదనపు పన్నులపై అంచనాలు ఉన్నా, ఇప్పుడు ఏకంగా 200 శాతం పన్ను విధించనున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించడంపై తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఇది అమలులోకి రావడం అసాధ్యమేనని అనేక మంది నిపుణులు భావిస్తున్నారు. చైనా ప్రస్థావనతో పోల్చుతూ, అప్పట్లో భారీగా సుంకాలు వేసిన తర్వాత చర్చలకు ముందుకువచ్చిందీ అమెరికానే అని గుర్తు చేస్తున్నారు.
Details
అమెరికాకే మన మందుల మూడో వంతు
భారతదేశం నుంచి ఎగుమతయ్యే ఔషధాల్లో సుమారుగా మూడో వంతు అమెరికాకే వెళ్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 9 బిలియన్ డాలర్ల (రూ.77,000 కోట్ల) విలువైన మందులు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అమెరికా బయట ఉన్న యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి గల ఉత్పత్తి కేంద్రాలు అత్యధికంగా మనదేశంలోనే ఉన్నాయి. ఏటా డీఎంఎఫ్, ఏఎన్‌డీఏ లాంటి అనుమతులకు ఎక్కువగా మన కంపెనీలు దరఖాస్తు చేస్తుంటాయి. జనరిక్ మందుల్లో భారత్ మీద అమెరికా అధికంగా ఆధారపడుతోంది. అమెరికాలో విక్రయమయ్యే మందుల్లో 20-25% జనరిక్ ఔషధాలే. వీటిపై 200% పన్ను విధిస్తే, వినియోగదారులకు బిల్లు బారిన పడటం ఖాయం.
Details
కంపెనీలకు ఆదాయ నష్టమూ ఖాయం
ఈ విధంగా అధిక పన్నులు విధిస్తే, మన ఫార్మా కంపెనీలకు తక్కువ ధరలకు ఔషధాలు విక్రయించాల్సి రావడం వల్ల లాభాలు తగ్గిపోతాయి. జనరిక్ ఔషధాల్లో లాభాల శాతం తక్కువే కావడంతో ధర తగ్గించడమంటే నష్టం తప్పదు. దీంతో కంపెనీలు అమ్మకాలు తగ్గించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర దేశాల మార్కెట్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం పెరుగుతుంది.
Details
ట్రంప్ నిర్ణయాలపై అవిశ్వాసమే!
దీన్ని బట్టి అమెరికా ప్రభుత్వం వాస్తవంగా 200% పన్నుల దిశగా వెళుతుందా అనే అనుమానాలూ ఉన్నాయి. ఎందుకంటే, ఇది అమెరికా ప్రజల ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టే నిర్ణయం అవుతుంది. అయినా, ట్రంప్ వ్యాఖ్యలు ఎప్పుడెప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేం కాబట్టి, భారత ఫార్మా పరిశ్రమ ఏ సవాల్‌కైనా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.