New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లులో 536 సెక్షన్లు .. 622 పేజీలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల జరిగిన బడ్జెట్ ప్రసంగంలో దేశంలో దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టాన్ని రద్దు చేసి, కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
ఈ ప్రక్రియలో భాగంగా కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు (New Income Tax Bill) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ బిల్లును ఫిబ్రవరి 13న (గురువారం) లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
వివరాలు
కొత్త బిల్లులో ఉన్న మార్పులు
ప్రస్తుతం అమలులో ఉన్న 1961 ఆదాయపు పన్ను చట్టంలో 298 సెక్షన్లు ఉండగా, కొత్త బిల్లులో 536 సెక్షన్లు ఉన్నాయి.
అలాగే, ప్రస్తుతం 14 షెడ్యూళ్లు ఉండగా, కొత్త బిల్లులో వాటిని 16కు పెంచనున్నారు.
అయితే, చాప్టర్ల సంఖ్య 23గానే కొనసాగనుంది. మరో ముఖ్యమైన మార్పుగా, బిల్లులోని పేజీల సంఖ్యను గణనీయంగా తగ్గించారు.
1961లో అమలులోకి వచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టం 880 పేజీల్లో ఉండగా, కొత్త బిల్లును 622 పేజీల్లో రూపొందించారు.
వివరాలు
కొత్త ఆదాయపు పన్ను చట్టానికి కారణం?
ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను చట్టంలో పన్ను విధానం, పథకాలు, ఇతర నిబంధనల కోసం పార్లమెంట్ ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది.
కానీ, కొత్త బిల్లులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT)కి కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చారు.
ఈ బిల్లులో ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్, డిజిటల్ ట్యాక్స్ మానిటరింగ్ సిస్టమ్స్ వంటి అంశాలను CBDT స్వతంత్రంగా రూపొందించుకునేలా ప్రతిపాదనలు చేశారు.
వివరాలు
తదుపరి ప్రక్రియ
ఈ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపనున్నారు.
ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలో పన్ను విధానాన్ని సరళీకరించేందుకు, సులభంగా అర్థం అయ్యేలా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
కొత్త చట్టం ద్వారా ప్రజలపై అదనపు పన్ను భారమేమీ ఉండదని ఆమె స్పష్టం చేశారు.
కొత్త చట్టంపై సూచనలు
ఇప్పటివరకు ఆదాయపు పన్ను చట్టం మార్పుపై ఐటీ విభాగానికి 6,500 సూచనలు వచ్చినట్లు సమాచారం. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని కొత్త చట్టాన్ని రూపుదిద్దారు.