
LIC Guinness record: 24 గంటల్లో 5.88 లక్షల పాలసీలు.. ఎల్‌ఐసీకి గిన్నిస్ రికార్డు గౌరవం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ (LIC) గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. గత జనవరి 20న కేవలం 24 గంటల్లోనే అత్యధిక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయిస్తూ ఈ అరుదైన ఘనతను సాధించింది. ఈ సరికొత్త రికార్డును లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ విస్తృత ఏజెన్సీ నెట్‌వర్క్ సమర్థతకు ఇది నిదర్శనమని తెలిపింది. అందులో భాగంగా 4,52,839 మంది ఏజెంట్లు ఒక్కరోజే 5,88,107 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను జారీచేశారు. బీమా రంగ చరిత్రలో ఇదే మొట్టమొదటి సారి ఈ స్థాయిలో పాలసీలు 24 గంటల వ్యవధిలో జారీ కావడం గమనార్హం.
Details
గొప్ప మైలురాయిని సాధించిన ఎల్ఐసీ
ఈ ఫీట్ సాధనతో తమ ఏజెంట్లు గొప్ప మైలురాయిని సాధించారని ఎల్‌ఐసీ పేర్కొంది. వారి అంకితభావం, కష్టపడి పని చేసిన తీరుకు ఇది గట్టి నిదర్శనమని పేర్కొంది. ఈ కార్యానికి ప్రేరణగా ఎల్‌ఐసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 'మ్యాడ్ మిలియన్ డే' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా సంస్థ ఎండీ, సీఈఓ సిద్దార్థ మొహంతీ, ప్రతి ఏజెంట్ కనీసం ఒక్క పాలసీ అయినా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ పిలుపుతోనే ఈ అరుదైన ఘనతను ఎల్‌ఐసీ సొంతం చేసుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఎల్లప్పుడూ కస్టమర్లకు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తమ సంస్థ, భవిష్యత్తులో మరిన్ని బెంచ్‌మార్క్‌లు నెలకొల్పే దిశగా ప్రయాణిస్తోందని ఎల్‌ఐసీ తెలిపింది.