చిరుధన్యాల పిండి ప్యాకెట్లపై 5శాతమే పన్ను.. భారీగా తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్
చిరుధాన్యల పిండిని ప్యాకెట్లలో, లేబుళ్లతో అమ్మితే 5శాతం జీఎస్టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక లూజుగా విక్రయించే 70శాతం త్రుణ ధాన్యాల పిండిపై ఎలాంటి పన్నులు ఉండవని ఆమె స్పష్టం చేశారు. అదే ప్యాకేజీ రూపంలో లేబుల్‌తో విక్రయించే పిండిపై మాత్రం 5శాతం పన్ను ఉంటుందని తెలిపారు. ఈ పిండి అమ్మకాలపై ఇంతకుముందున్న 18శాతం పన్ను ఉండేది. ఇప్పుడు 5శాతానికి తగ్గించారు. దీంతో ఇప్పుడు పన్నురేటు బాగా తగ్గడం గమనార్హం.
నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ మండలి సమావేశం
శనివారం నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ మండలి 52వ సమావేశం జరిగింది. జీఎస్‌టీ అప్పీలేట్ ట్రైబ్యునల్ ప్రెసిడెంట్‌కు గరిష్ఠ వయస్సు పరిమితిని 70 ఏళ్లుగాను, సభ్యులకు 67 ఏళ్లుగా ఉండాలని ఈ సమావేశంలో నిర్ధారించారు. మరోవైపు మొలాసిస్‌పై కూడా జీఎస్టీని 28శాతం నుంచి 5శాతానికి జీఎస్టీ మండలి తగ్గించింది. పరిశ్రమలు ఉపయోగించే ఆల్కహాల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకు రావాలని నిర్ణయించారు. ఇక మానవ అవసరాలకు వాడే ఆల్కహాల్‌కు మాత్రం జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆన్ లైన్ గేమింగ్, కేసినోలకు పాత తేదీల నుంచి 28శాతం జీఎస్టీ చెల్లించాలంటూ కంపెనీలకు పన్ను నోటీసులు చెల్లించడంపై దిల్లీ, గోవా రాష్ట్రాలు అభ్యతరం వ్యక్తం చేశాయి.