LOADING...
రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది
2023 చివరి నాటికి 5G మార్కెట్ 70% విస్తరిస్తుందని అంచనా

రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 19, 2023
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

2023లో భారతదేశంలో 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లాభాల్లోకి వెళ్ళేటట్లు కనిపిస్తోంది. సైబర్‌మీడియా రీసెర్చ్ (CMR) నివేదిక ప్రకారం, 2023 చివరి నాటికి మార్కెట్ 70% విస్తరిస్తుందని అంచనా. భారతీయ నగరాల్లో 5G సేవలను వేగంగా ప్రవేశపెట్టడం, వినియోగదారుల ఆసక్తి పెరగడం ఈ వృద్ధికి కారణాలని నివేదిక చెప్తుంది. 5G స్మార్ట్‌ఫోన్‌లు 2020 నుండి భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. అయితే, 5G స్పెక్ట్రమ్ వేలం తరువాత 5G హ్యాండ్‌సెట్‌ల రవాణా పెరిగింది. దేశంలోని రెండు ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, జియో నగరాల్లో 5G సేవలను విస్తరించడం మొదలుపెట్టాయి.

ఫోన్

ఈ ఏడాది విడుదలైన 75% శాతం ఫోన్లు 5G సామర్ధ్యంతో పనిచేస్తాయి

2020లో ప్రవేశపెట్టినప్పటి నుండి 5G స్మార్ట్‌ఫోన్‌లు 13 రెట్లు వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది భారత్‌లో దాదాపు 100 5G స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యాయి. 2023లో కొత్తగా ప్రవేశపెట్టిన 75% స్మార్ట్‌ఫోన్‌లు 5G సామర్థ్యంతో ఉంటాయని నివేదిక తెలిపింది. 5G బ్రాడ్‌బ్యాండ్ కారణంగా 2020 నుండి 2026 మధ్యకాలంలో భారతదేశం డేటా వినియోగం 29% పెరుగుతుందని GlobalData గత సంవత్సరం మరో నివేదిక సమర్పించింది. అదే సమయంలో, డేటా ఆదాయం కూడా 67% పెరుగుతుంది. అయితే, భారతీయ వినియోగదారులు 5Gని ఎంతమేరకు ఉపయోగిస్తారనే విషయంపై ఈ నివేదిక సందేహాన్ని వ్యక్తం చేసింది. ఈ నివేదిక ప్రకారం, 2026 నాటికి దేశంలోని మొబైల్ సబ్‌స్క్రైబర్‌లలో 27% మంది మాత్రమే 5Gని ఉపయోగించే అవకాశం ఉంది.