Satya Nadella: ఉద్యోగులపై 85శాతం మేనేజర్లు అసంతృప్తి.. సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు
మైక్రోసాఫ్ట్‌లో ఉత్పాదకత సమస్యలు ఎదురవుతున్నాయని, వీటిని అధిగమించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నామని ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్‌తో జరిగిన చర్చలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల పని వాతావరణంలో వచ్చిన మార్పులొచ్చాయన్నారు. రిమోట్ వర్క్ సవాళ్ల కారణంగా ఉత్పాదకత సమస్యలు తలెత్తుతున్నాయని నాదెళ్ల పేర్కొన్నారు. 85 శాతం మేనేజర్లు తమ ఉద్యోగులు సరిగా పనిచేయడం లేదని భావిస్తున్నారని, మరోవైపు 85 శాతం ఉద్యోగులు తాము ఎక్కువ పని చేస్తున్నట్లు చెబుతున్నారన్నారు.
ఆధునిక నాయకత్వ నైపుణ్యాలను అలవర్చుకోవాలి
ఈ విభేదాన్ని ఎలా పరిష్కరించాలన్న దానిపై కంపెనీ దృష్టి పెట్టిందన్నారు. సమస్యలను అధిగమించడానికి నాయకత్వం కీలకమని, నాయకులు వారి లక్ష్యాలను ఎలాగు సాధించాలన్న విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరమని నాదెళ్ల హితవు పలికారు. నైపుణ్యాలను క్రమంగా పెంపొందించుకోవడం అత్యంత ముఖ్యమని, ఈ క్రమంలో శక్తివంతమైన నాయకుల అవసరం ఉందని సత్య నాదెళ్ల హితవు పలికారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాలను అనుసరించి కొత్త మార్గాలు అవలంభించడం, ఆధునిక నాయకత్వ నైపుణ్యాలను అలవర్చుకోవడం కీలకమని ఆయన చెప్పారు.