
8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. కనీస వేతనం 18వేల నుంచి రూ. 30వేలకు పెంచే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘానికి సంబంధించి తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ అప్‌డేట్ వారిలో చాలామందికి నిరాశే మిగిలేలా ఉంది. ఊహించినంతగా కనీస వేతనం పెరగకపోవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మందికి పైగా పెన్షనర్లు 8వ వేతన సంఘంపై తమ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇప్పటివరకు అనేక మంది కనీస వేతనం రూ. 18 వేల నుండి రూ. 51 వేల వరకూ పెరుగుతుందన్న అంచనాలు వేసుకున్నారు.
వివరాలు
2026 చివరి నాటికైనా లేదా 2027 ప్రారంభంలో అమలు చేసే అవకాశం
కానీ తాజా సమాచారం ప్రకారం.. వాస్తవ పరిస్థితి అంచనాలకు విరుద్ధంగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా అమలు కావనున్న 8వ వేతన సంఘం కారణంగా ఉద్యోగుల జీతాల్లో సగటున కేవలం 13 శాతం మాత్రమే పెరుగుతుందని చెబుతున్నారు. అంతకు ముందు వరకు జీతం కనీసం మూడు రెట్లు పెరుగుతుందన్న భావన వినిపించేది. ఈ నేపథ్యంలో తాజా నివేదికలు పరిశీలిస్తే, ఉద్యోగుల ఆశలు కొంతవరకూ తొలిగిపోతున్నట్లు అనిపిస్తోంది. అంతేగానీ ఈ వేతన సంఘం తక్షణమే అమలులోకి రాదని చెబుతున్నారు. కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం ఈ పర్యాయ వేతన సంఘాన్ని 2026 చివరి నాటికైనా లేదా 2027 ప్రారంభంలో అమలు చేసే అవకాశమే ఉన్నట్టు తెలుస్తోంది.
వివరాలు
కనీస వేతనం ఎంతవరకు పెరగవచ్చు?
కోటక్ నివేదిక ప్రకారం 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ను 1.8గా నిర్ణయించే అవకాశం ఉంది. అంటే ప్రస్తుత జీతాన్ని 1.8తో గుణిస్తే కొత్త జీతం లెక్కించవచ్చు. దీని ప్రకారం కనీస జీతం నెలకు రూ. 18 వేల నుంచి రూ. 30 వేల వరకే పెరగవచ్చని భావిస్తున్నారు. గతంలో పలు అంచనాల ప్రకారం రూ. 51 వేల వరకూ పెరగవచ్చన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజా లెక్కలు చూస్తే ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది నిరాశ కలిగించే అంశమే.
వివరాలు
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి?
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది జీతాల పెంపులో కీలక పాత్ర పోషిస్తుంది. పాత పే స్కేల్‌ను ఆధారంగా చేసుకుని కొత్త పే స్కేల్‌ను నిర్ణయించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు 7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉండటంతో చాలా మంది ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగాయి. కానీ 8వ వేతన సంఘంలో ఇది 1.8గా ఉంటే పెరుగుదల తక్కువగానే ఉండే అవకాశం ఉంది.
వివరాలు
వేతన సంఘం అమలులో ఆలస్యం ఎందుకు?
కోటక్ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని 2025 జనవరిలో ప్రకటించినా, ఇప్పటి వరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) నిర్దేశించలేదు. అలాగే కమిషన్ సభ్యుల నియామకం కూడా జరగలేదు. సాధారణంగా వేతన సంఘం తన నివేదిక రూపొందించేందుకు 18 నెలలు పడుతుంది. ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి అమలు చేయడానికి మరో 3 నెలల నుంచి 9 నెలల సమయం పడే అవకాశముందని నివేదిక పేర్కొంది.
వివరాలు
కేంద్ర ప్రభుత్వానికి పడే భారం ఎంత?
8వ వేతన సంఘం అమలుతో కేంద్ర ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడనుందని కోటక్ అంచనా వేసింది. దాదాపు రూ. 2.4 లక్షల కోట్లు నుంచి రూ. 3.2 లక్షల కోట్లు అదనంగా ఖర్చవుతుంది. ఇది దేశ GDPలో 0.6 శాతం నుంచి 0.8 శాతం వరకూ ఉంటుంది. ఈ వేతన పెంపుతో కేంద్ర ఉద్యోగుల్లో సుమారు 90 శాతం గ్రేడ్-C ఉద్యోగులకు పెద్ద ప్రయోజనం చేకూరనుంది.
వివరాలు
వినియోగ రంగాలపై ప్రభావం ఏంటి?
గత వేతన సంఘాల మాదిరిగా ఈసారి కూడా వేతన పెంపు వల్ల వినియోగ రంగాలు (FMCG)లో భారీగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉద్యోగుల ఆదాయంలో పెరుగుదల కారణంగా ఆదాయ పొదుపు కూడా పెరగవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది రూ. 1 లక్ష కోట్లు నుంచి రూ. 1.5 లక్షల కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. దీని వల్ల ఉద్యోగులు స్టాక్ మార్కెట్లు, బ్యాంక్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ వంటి భద్ర పెట్టుబడులపై దృష్టి సారించగలుగుతారు.
వివరాలు
పార్లమెంటులో సమాధానం ఇచ్చిన కేంద్రం
ఇటీవల జూలై 21న పార్లమెంటులో 8వ వేతన సంఘానికి సంబంధించి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రక్షణ, హోం, సిబ్బంది శాఖలతో పాటు రాష్ట్రాల నుంచి కూడా సూచనలు తీసుకున్నట్టు చెప్పారు. కమిషన్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తరువాత మాత్రమే 8వ వేతన సంఘం అమల్లోకి వస్తుందని తెలిపారు.
వివరాలు
ప్రతి 10 ఏళ్లకోసారి వేతన సంఘం
సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. ద్రవ్యోల్బణం, జీవన ఖర్చుల పెరుగుదల నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు,పెన్షన్లను పునరాలోచించడం దీనివల్ల సాధ్యమవుతుంది. గత 7వ వేతన సంఘం 2016లో అమల్లోకి వచ్చింది. ఇప్పుడు 8వ వేతన సంఘం కోసం దేశవ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లు వేచి చూస్తున్నారు.