8th Pay Commission: 8వ వేతన సంఘం పై కేంద్రం కీలక నిర్ణయం: ఉద్యోగులకు ఏం మారనుంది?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన కమిషన్ అమల్లోకి వస్తుందన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్ల జీతాలు,పెన్షన్లు, వివిధ రకాల అలవెన్సులు ఇవన్నీ ఆ కమిషన్ సిఫార్సుల ఆధారంగానే నిర్ణయించబడతాయి. ప్రస్తుతం కొనసాగుతున్న 7వ వేతన సంఘం ఈ ఏడాది చివరి నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం మీదగా కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీ ఏర్పాటుకు సంవత్సరం ఆరంభంలోనే అనుమతి ఇచ్చినప్పటికీ, పనిచేసే విధానాల ఆమోదం మాత్రం ఆలస్యమై, గత నెలలోనే అధికారిక ప్రకటన వెలువడింది. కొత్త వేతన సంఘం సిఫార్సులు ఇవ్వడానికి 18 నెలల గడువు నిర్ణయించారు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ సమర్పణ పూర్తయ్యాకే ప్రభుత్వం కొత్త కమిషన్‌ను అమలు చేస్తుంది.
వివరాలు
డిసెంబర్ 31 తర్వాత DA పెంపు ఉండదా?
అలాగే వేతన సంఘం ఇచ్చే సిఫార్సుల ఆధారంగానే ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), అలాగే పింఛన్‌దారుల డియర్‌నెస్ రిలీఫ్ (DR) వంటి ప్రయోజనాలు మారుతుంటాయి. ఏడు వేతన సంఘం కాలం ముగియబోతున్నఈ సమయంలో, 8వ వేతన సంఘం అమల్లోకి రావడానికి కనీసం ఇంకొక సంవత్సరం పైగానే పడుతుందని అంచనా. దీనితో డిసెంబర్ 31 తర్వాత డీఏ, డీఆర్, హెచ్ఆర్ఏ పెంపులను కేంద్రం నిలిపేస్తుందా? అనే సందేహం చాలామందిలో ఉంది. దీనిపై నిపుణులు స్పందించారు.
వివరాలు
మూడు సార్లు డీఏ పెరుగుదలకు అవకాశం
కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చేంత వరకూ ప్రస్తుత 7వ వేతన సంఘం నిబంధనలు అలాగే కొనసాగుతాయని, అవే ఆధారంగా డీఏ, హెచ్ఆర్ఏ పెరుగుతూనే ఉంటాయని వారు అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగుల డీఏ 58% వద్ద ఉంది. నెక్స్‌డిగ్మ్ డైరెక్టర్ (పేరోల్స్) రామచంద్రన్ కృష్ణమూర్తి ప్రకారం, కొత్త సంఘం వచ్చే వరకు పాత రూల్స్ వర్తిస్తాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని డీఏ సవరించబడుతుంది. కొత్త వేతన సంఘం అమలుకు 18 నెలల సమయం పడుతుందనుకుంటే, ఈ వ్యవధిలో మూడు సార్లు డీఏ పెరుగుదలకు అవకాశముందని, ఒక్కోసారి మూడు శాతం చొప్పున పెరిగినా మొత్తం 67% వరకు చేరొచ్చని ఆయన వివరించారు.
వివరాలు
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ సుమారు 2.13 దాకా వెళ్లే అవకాశం
అలాగే డీఏ పెరగడం వల్ల 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై కూడా ప్రభావం పడుతుందని ఆలిండియా NPS ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ పేర్కొన్నారు. రాబోయే 18నెలల్లో రెండు వార్షిక ఇంక్రిమెంట్లు (ప్రతి ఒక్కటి 7% చొప్పున) పొందడం,అదనంగా పెరుగుతున్న డీఏ..ఈ రెండింటి కలయికతో ఉద్యోగుల బేసిక్ పే పెరుగుతుంది. ఈపెరుగుదల వల్ల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ సుమారు 2.13 దాకా వెళ్లే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అంటే కనీస వేతనం కూడా అదే నిష్పత్తిలో 2.13 రెట్లు పెరిగే అవకాశం ఉంది. కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత డీఏ బేసిక్ పేలో విలీనమై,మళ్లీ డీఏ లెక్కలు మొదటి నుంచి ప్రారంభమవుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.