8th Pay Commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించనున్నట్లు సమాచారం. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి కీలకమైన దశ ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది. ప్రతి పదేళ్లకోసారి వేతన సంఘం ఏర్పాటు చేస్తారు. ఈ సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యాలను సమీక్షిస్తుంది. అలాగే, కాలానుగుణంగా డీఏ పెంపుపై సిఫార్సులు చేస్తుంది. గతంలో 7వ వేతన సంఘం 2016 జనవరి 1న అమల్లోకి వచ్చింది, 2026 జనవరి 1న 8వ వేతన సంఘం అమలయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడనప్పటికీ, అధికారుల సమాచారం మేరకు 8వ వేతన సంఘం ఏర్పాటుకు తొలి అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ పెంపు..
ఉద్యోగ సంఘాలు కూడా కేంద్రాన్ని,8వ వేతన సంఘంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. 7వ వేతన సంఘంలో కనీస వేతనం 7,000 నుంచి 18,000 రూపాయలకు పెరిగింది.అలాగే,కనీస పెన్షన్ 3,500 రూపాయల నుంచి 9,000 రూపాయలకు పెరిగింది. గరిష్ట వేతనం 2.5 లక్షలు కాగా, గరిష్ట పెన్షన్ 1.25 లక్షలుగా నిర్ణయించారు.ఉద్యోగులు 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ పెంపును,అలాగే పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని వేతనాలు పెంచాలని కోరుతున్నారు. కేంద్ర సహాయ ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి,రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, వేతన సంఘంపై నిర్ణయం ఇంకా తీసుకోలేదని,త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు. 2014లో 7వ వేతన సంఘం సమీక్షించినట్టు, 2024లో 8వ వేతన సంఘం ఏర్పాటుకు అవకాశం ఉందని భావిస్తున్నారు.