8th Pay Commission: జనవరి 2026 నుంచి 8వ వేతన సంఘం బకాయిలు చెల్లిస్తారా?
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం అమలుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొత్త వేతన సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 2026 జనవరి 1 నుంచే కొత్త వేతనాలు వర్తిస్తాయా? ఒకవేళ అమలు ఆలస్యమైతే అప్పటి నుంచి ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లిస్తారా? అనే ప్రశ్నలు ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన అంశం కావడంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్లు, పార్లమెంటులో ఇచ్చిన సమాధానాలను పరిశీలిస్తే.. 2026 జనవరి 1 నుంచి వేతన బకాయిలు చెల్లిస్తామని కేంద్రం ఎలాంటి అధికారిక హామీ ఇవ్వలేదు.
వివరాలు
8వ వేతన సంఘం ఏర్పాటు.. 2027 మే నాటికి తుది నివేదిక
2025 నవంబర్ 3న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా 8వకేంద్ర వేతనసంఘాన్ని అధికారికంగా ఏర్పాటు చేశారు.
ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్‌టైమ్ సభ్యుడిగా, పంకజ్ జైన్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
కమిషన్‌కు అప్పగించిన విధివిధానాల ప్రకారం.. ఏర్పాటు చేసిన తేదీ నుంచి 18నెలల్లోగా కేంద్ర ప్రభుత్వానికి తుదిసిఫార్సులు అందించాలి.
అంటే 2027 మే నాటికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి మధ్యంతర నివేదికలను కూడా సమర్పించే అవకాశం కమిషన్‌కు కల్పించారు.
ప్రస్తుతం ఈ కమిషన్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు,ఇతర భాగస్వామ్య పక్షాలతో సమావేశమవుతోంది.
వివరాలు
పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది?
వారి అభిప్రాయాలు, డిమాండ్లను సేకరిస్తూ సిఫార్సుల రూపకల్పనపై కసరత్తు చేస్తోంది.
8వ వేతన సంఘం అమలు తేదీ, వేతన బకాయిల చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలో లోక్‌సభలో 2025 డిసెంబర్ 8న ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం కీలకంగా మారింది.
వేతన సంఘం తన సిఫార్సులను సమర్పించిన తర్వాత వాటిని పరిశీలించి,అమలు తేదీని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఆమోదం పొందిన సిఫార్సులను అమలు చేయడానికి అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తామని తెలిపారు.
అయితే 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు వర్తింపజేస్తామని కానీ, ఆ తేదీ నుంచి వెనక్కి లెక్కించి బకాయిలు చెల్లిస్తామని కానీ ఆయన ఎక్కడా ప్రకటించలేదు.
వివరాలు
సుమారు 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభావం
దీంతో ఉద్యోగులు ఆశిస్తున్నట్లుగా జనవరి 1, 2026 నుంచే బకాయిలు వస్తాయా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
8వ వేతన సంఘం సిఫార్సుల ప్రభావం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్లపై ఉండనుంది.
అధికారిక గణాంకాల ప్రకారం.. సుమారు 50.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లు ఈ కమిషన్ పరిధిలోకి వస్తారు.
మొత్తంగా దాదాపు 1.19 కోట్ల మంది ప్రయోజనాలు ఈ వేతన సంఘం నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి.
వీరి వేతనాలు, అలవెన్సులు, పెన్షన్ ప్రయోజనాల్లో మార్పులు చేసే సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కమిషన్‌కు సూచించింది.
వివరాలు
సుమారు 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభావం
ద్రవ్య క్రమశిక్షణ, అభివృద్ధి పథకాలకు అవసరమైన నిధులు, పెన్షన్లపై పడే అదనపు భారం,రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలను పరిశీలించాలని స్పష్టం చేసింది.
మరోవైపు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి? కనీస వేతనాన్ని ఎంత పెంచాలి? బకాయిలను ఏ తేదీ నుంచి లెక్కించాలి? వాటిని ఏ విధంగా చెల్లించాలి? అనే అంశాలపై ఉద్యోగులు,పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ విషయాలపై కేంద్ర ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు ఎలాంటి నిర్ణయమూ ఖరారైనట్లు భావించకూడదు.
ముఖ్యంగా జనవరి 1, 2026 నుంచి బకాయిలు వస్తాయనే ప్రచారాన్నిఅధికారిక ప్రకటనగా పరిగణించకూడదు.
ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ,8వ వేతన సంఘం విడుదల చేసే అధికారిక సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవడం మంచిది.