Adani Group: ఐటిడి సిమెంటేషన్ ఇండియాలో 46.64% వాటా కొనుగోలుకు సిద్దమైన అదానీ గ్రూప్
గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ వ్యాపార విస్తరణలో దూకుడుగా ముందుకు వెళ్తోంది. సిమెంట్ వ్యాపారంలో తన సామర్థ్యాన్ని పెంచాలని కోరుకుంటోంది. ఈ క్రమంలో,ఐటీడీ సిమెంటేషన్ ఇండియాలో 46.64 శాతం ప్రమోటర్ వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఆంగ్ల మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఈ వారం ప్రారంభంలో,ఈ రెండు పార్టీల మధ్య వాటా కొనుగోలుపై ఒప్పందం కుదుర్చినట్టు సమాచారం. రూ. 5,888.57 కోట్లతో ఈ ఒప్పందం జరిగేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.అయితే,ఇరు కంపెనీలు ఇప్పటివరకు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఈ వార్తల నేపథ్యంలో,ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ షేర్లు గణనీయంగా పెరిగాయి.ఉదయం 10:16 గంటల సమయంలో షేరు విలువ 17.70శాతం పెరిగి రూ.554.50 వద్ద ట్రేడవుతోంది.
2028 ఆర్థిక సంవత్సరానికి సిమెంట్ మార్కెట్‌లో 20శాతం వాటా
అంబుజా, ఏసీసీ సిమెంట్స్‌లో వాటాలు కొనుగోలు చేసి సిమెంట్ వ్యాపారంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్, విస్తరణలో ముందుకు సాగుతోంది. 2028 ఆర్థిక సంవత్సరానికి దేశీయ సిమెంట్ మార్కెట్లో తన వాటాను 20 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రుణరహితంగా ఉండాలని నిర్ణయించుకుంది. 2028 నాటికి సంవత్సరానికి ఉత్పత్తి 140 మిలియన్ టన్నులకు చేరుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అదానీ గ్రూప్ ఎంట్రీతో, ఇప్పటికే ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ క్రమంలో, చిన్న కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయి. గత రెండు సంవత్సరాలలో, అదానీ, అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థలు ఆరు కొనుగోళ్లను పూర్తి చేశాయి. అల్ట్రాటెక్ తాజా ఏడో కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.