Adani Enterprises to Adani Power: గౌతమ్ అదానీకి అమెరికాలో భారీ ఊరట.. దూసుకెళ్లిన అదానీ షేర్లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో గౌతమ్ అదానీపై నమోదైన క్రిమినల్ కేసులను అమెరికా న్యాయశాఖ (DoJ) ఉపసంహరించుకునేందుకు ముందుకు రావడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. దీంతో గత కొన్ని నెలలుగా గ్రూప్‌పై కొనసాగుతున్న న్యాయపరమైన అనిశ్చితికి కొంత ఊరట లభించినట్టైంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్,అదానీ పవర్,అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ సహా పలు కంపెనీల షేర్లు 1 శాతం నుంచి 3.5 శాతం వరకు పెరిగాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ 3.5 శాతం పెరిగి రూ.1,417 వద్ద ట్రేడ్ కాగా.. అదానీ టోటల్ గ్యాస్ 3.3 శాతం లాభంతో రూ.630.40కు చేరింది.
వివరాలు
1 శాతం మేర పెరిగిన అదానీ పోర్ట్స్ షేర్
గ్రూప్ ఫ్లాగ్‌షిప్ సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ 3 శాతం పైగా పెరిగి రూ.2,774.50 వద్ద నిలిచింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్ షేర్లు సుమారు 2.5 శాతం చొప్పున లాభపడగా.. అదానీ పోర్ట్స్ షేర్ కూడా 1 శాతం మేర పెరిగింది. భారతదేశంలో విద్యుత్ సరఫరా ఒప్పందాలకు సంబంధించి లంచాల వ్యవహారంలో గౌతమ్ అదానీతో పాటు ఆయన సహచరులు పాత్ర వహించారనే ఆరోపణలపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులను కొట్టివేయాలని అమెరికా న్యాయశాఖ కోర్టును కోరినట్లు సమాచారం. దీంతో పెట్టుబడిదారుల్లో ఉన్న ఆందోళనలు తగ్గాయి. ఇదిలా ఉండగా, ఇరాన్ ఆంక్షలకు సంబంధించిన ఎల్పీజీ దిగుమతుల కేసులో కూడా అదానీ ఎంటర్‌ప్రైజెస్ రాజీకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
వివరాలు
అదానీ గ్రూప్ అమెరికాలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ప్రణాళికలు
దీంతో గ్రూప్‌పై ఉన్న న్యాయపరమైన ఒత్తిడి మరింత తగ్గినట్టైంది. గత కొంతకాలంగా అమెరికా దర్యాప్తులు అదానీ గ్రూప్‌కు పెద్ద సమస్యగా మారి, విదేశీ విస్తరణ ప్రణాళికలు, నిధుల సమీకరణపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యక్తిగత న్యాయవాదిగా కూడా పనిచేస్తున్న గౌతమ్ అదానీ తరఫు లాయర్.. అదానీ గ్రూప్ అమెరికాలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపినట్లు రిపోర్టులు వెల్లడించాయి. కేసులు పెండింగ్‌లో ఉన్నంతకాలం ఆ పెట్టుబడులు ముందుకు సాగే అవకాశం లేదని సమాచారం.
వివరాలు
సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు పొందేందుకు లంచాలు
ఇక ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. 2020 నుంచి 2024 మధ్యకాలంలో భారత్‌లో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు పొందేందుకు 250మిలియన్ డాలర్లకు పైగా లంచాల వ్యవహారం జరిగిందని అమెరికా SEC ఆరోపించింది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీతో పాటు మరికొంతమంది సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు పొందేందుకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే అదానీ తరఫు న్యాయవాదులు ఈ లావాదేవీలు పూర్తిగా భారత్‌కే సంబంధించినవని,ఈ కేసు అమెరికా పరిధిలోకి రాదని గట్టిగా వాదించాయి. ఇటీవల న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా కేసును కొట్టివేయాలంటూ అదానీ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించింది.
వివరాలు
SEC సివిల్ కేసులో రాజీ ప్రక్రియ
ఇప్పుడు అమెరికా ప్రభుత్వం కేసులను ఉపసంహరించుకునే దిశగా అడుగులు వేయడంతో అదానీ గ్రూప్‌కు ఇది పెద్ద ఊరటనిచ్చే పరిణామంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కేసుల ఉపసంహరణపై అదానీ గ్రూప్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు SEC సివిల్ కేసులో రాజీ ప్రక్రియ కూడా కొనసాగుతోందని సమాచారం. అందులో భాగంగా గౌతమ్ అదానీ 6 మిలియన్ డాలర్లు, సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్ల సివిల్ పెనాల్టీలు చెల్లించేందుకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి తప్పును అంగీకరించినట్లు కాదని స్పష్టం చేశారు.