
EPFO: ఒకే లాగిన్‌తో అన్ని ఈపీఎఫ్‌వో సేవలు: కేంద్ర మంత్రి మాండవీయ
ఈ వార్తాకథనం ఏంటి
భవిష్యనిధి సంస్థ (EPFO) అందించే అన్ని సేవలను ఇకపై ఒకే లాగిన్ ఐడీ ద్వారా పొందే అవకాశం కలుగుతోంది. ఇప్పటివరకు వేర్వేరు లాగిన్‌లతో ఈ సేవలను వినియోగించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాటిని ఒకే ప్లాట్‌ఫారమ్ కిందకు తీసుకువస్తున్నట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ గురువారం ప్రకటించారు. ఈ కొత్త సౌకర్యం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 7 కోట్ల మంది చందాదారులకు లాభం చేకూరుతుందని ఆయన వివరించారు.
వివరాలు
'పాస్‌బుక్ లైట్' ద్వారా ఖాతా వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు
ప్రస్తుతం చందా వివరాలను తెలుసుకోవడానికి, అడ్వాన్సులు తీసుకోవాలన్నా, డబ్బును విత్‌డ్రా చేసుకోవాలన్నా సభ్యులు ప్రత్యేకంగా పాస్‌బుక్ పోర్టల్‌లో లాగిన్ కావాల్సి వచ్చేది. కానీ తాజాగా అందిస్తున్న సౌకర్యం వల్ల మెంబర్ పోర్టల్‌లోనే అందుబాటులో ఉన్న 'పాస్‌బుక్ లైట్' ద్వారా ఖాతా వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా పాస్‌బుక్ పోర్టల్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. సభ్యులు మెంబర్ పోర్టల్ (https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface/ ) ద్వారా ఈ వివరాలను చూసుకోవచ్చు. అయితే గ్రాఫిక్ వివరాలతో ఉండే పాస్‌బుక్ కోసం మాత్రం ప్రస్తుతమున్న పోర్టల్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
వివరాలు
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ కూడా ఆన్‌లైన్‌లో
ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు పీఎఫ్ బదిలీ కోసం ఉపయోగించే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (Annexure-K) ఇకపై నేరుగా సభ్యుడు ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్‌ను ఫారం-13 ద్వారా ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత Annexure-K పాత పీఎఫ్ కార్యాలయం రూపొందించి కొత్త కార్యాలయానికి పంపేది. సభ్యుడు అది కావాలనుకుంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కానీ కొత్త నిబంధనలతో ఆ అవసరం ఉండదు. Annexure-Kను సభ్యులు నేరుగా మెంబర్ పోర్టల్ నుంచే పొందవచ్చు.
వివరాలు
వేగవంతమైన సెటిల్‌మెంట్ సౌకర్యం
తాజాగా తీసుకొస్తున్న ఈ మార్పుల వల్ల పీఎఫ్ బదిలీలు, సెటిల్‌మెంట్లు, అడ్వాన్సులు, రీఫండ్‌లు, అనుమతుల వంటి ప్రక్రియలు వేగంగా పూర్తవుతాయని మంత్రి మాండవీయ తెలిపారు. ఇప్పటి వరకు ఈ అనుమతులను ప్రధానంగా ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లు లేదా కార్యాలయ ఇన్‌ఛార్జ్‌లు మాత్రమే మంజూరు చేసేవారు. ఇకపై ఈ అధికారాలను సహాయ పీఎఫ్ కమిషనర్లు, ఇతర సబార్డినేట్ స్థాయి అధికారులకు కూడా బదిలీ చేస్తున్నట్టు వెల్లడించారు. దీని వలన అవసరమైన అనుమతులు త్వరగా లభించి, సెటిల్‌మెంట్ ప్రక్రియలు ఫాస్ట్‌ట్రాక్‌లో పూర్తవుతాయని మంత్రి చెప్పారు.