LOADING...
PM Modi-Amazon CEO: మోదీతో అమెజాన్ సీఈఓ భేటీ.. భారత్‌లో రూ.4.53 లక్షల కోట్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్
మోదీతో అమెజాన్ సీఈఓ భేటీ.. రూ.4.53లక్షల కోట్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్

PM Modi-Amazon CEO: మోదీతో అమెజాన్ సీఈఓ భేటీ.. భారత్‌లో రూ.4.53 లక్షల కోట్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీతో కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. 2026 నుంచి 2030 మధ్యకాలంలో భారత్‌లో 48 బిలియన్ డాలర్లు (సుమారు రూ.4.53 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా భారత మార్కెట్‌పై తమకు ఉన్న దీర్ఘకాలిక నమ్మకం,నిబద్ధతను మరోసారి చాటిచెప్పింది. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ),క్లౌడ్ మౌలిక సదుపాయాల విస్తరణకు కూడా అమెజాన్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. 2030 నాటికి ఈ రెండు రంగాల్లో అదనంగా 13బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆండీ జెస్సీ తెలిపారు.

వివరాలు 

ఏఐ, క్లౌడ్ విభాగాల్లో 21 బిలియన్ డాలర్లు దాటనున్న అమెజాన్ మొత్తం పెట్టుబడి

దీంతో ఏఐ, క్లౌడ్ విభాగాల్లో అమెజాన్ మొత్తం పెట్టుబడి విలువ 21 బిలియన్ డాలర్లను దాటనుంది. ఈ పెట్టుబడులలో భాగంగా ముంబై, హైదరాబాద్‌లలో ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింత పెంచనున్నారు. దీని ద్వారా స్టార్టప్‌లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు కస్టమ్ ఏఐ చిప్స్, అత్యాధునిక క్లౌడ్ సాంకేతికత, డెవలపర్ టూల్స్ వంటి సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. తద్వారా దేశంలో సాంకేతిక ఆవిష్కరణలకు వేగం పెరుగుతుందని కంపెనీ పేర్కొంది.

వివరాలు 

భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల మొత్తం విలువ 88 బిలియన్ డాలర్లు 

ప్రధాని మోదీతో సమావేశం అనంతరం ఆండీ జెస్సీ మాట్లాడుతూ.. "దశాబ్దం క్రితం భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించాం. అప్పటి నుంచి ఈ-కామర్స్, ఏఐ, క్లౌడ్ సేవల రంగాల్లో విశేష వృద్ధిని నమోదు చేశాం. ప్రధాని మోదీ ప్రతిపాదించిన 'వికసిత్ భారత్', 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాల సాధనలో భాగస్వామిగా కొనసాగేందుకు మేము కట్టుబడి ఉన్నాం. భారత్ అభివృద్ధి ప్రయాణంలో దీర్ఘకాలిక భాగస్వామిగా ముందుకు సాగుతాం" అని తెలిపారు. తాజా పెట్టుబడులతో కలిపి 2010 నుంచి 2030 వరకు భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల మొత్తం విలువ 88 బిలియన్ డాలర్లకు పైగా చేరనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Advertisement

వివరాలు 

2.8 మిలియన్ల ఉద్యోగాలకు మద్దతు

భారత్‌లో గత కొన్నేళ్లలో 12 మిలియన్ల చిన్న వ్యాపారాలను డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చామని అమెజాన్ తెలిపింది. అలాగే 20 బిలియన్ డాలర్ల విలువైన ఈ-కామర్స్ ఎగుమతులకు తోడ్పాటునందించామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.8 మిలియన్ల ఉద్యోగాలకు మద్దతు ఇచ్చామని వివరించింది. అంతేకాకుండా 10 మిలియన్ల మంది భారతీయులకు క్లౌడ్ నైపుణ్యాలపై శిక్షణ అందించినట్లు వెల్లడించింది.

Advertisement

వివరాలు 

రానున్న రోజుల్లో 3.8 మిలియన్ల ఉద్యోగాలకు మద్దతు

భవిష్యత్తులోనూ కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత డిజిటలైజేషన్, ఎగుమతుల విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపుపై దృష్టి సారించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. రానున్న రోజుల్లో 3.8 మిలియన్ల ఉద్యోగాలకు మద్దతు అందించడం, 80 బిలియన్ డాలర్ల సంచిత ఈ-కామర్స్ ఎగుమతులను సాధించడం,15 మిలియన్ల చిన్న వ్యాపారాలకు ఏఐ ప్రయోజనాలను చేరవేయడం,అలాగే 4 మిలియన్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐపై శిక్షణ అందించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు వెల్లడించింది.

Advertisement