#NewsBytesExplainer: అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు.. భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందని అక్కడి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా సంకేతాలిచ్చారు.
వాణిజ్య మంత్రి కూడా ట్రంప్ ఆర్థిక విధానాల అమలుకు మాంద్యం వచ్చినా ఫర్వాలేదన్న విధంగా మాట్లాడుతున్నారు.
ఆర్థిక శాఖ మంత్రి అయితే భవిష్యత్‌లో ప్రతికూల పరిణామాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
చరిత్రను పరిశీలిస్తే, ఏ దేశంలో అయినా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు దాని మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే.
Details
కొవిడ్ సమయంలో తాత్కాలిక మాంద్యం
నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్ ప్రకారం, వరుసగా రెండు త్రైమాసికాల పాటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) నెగటివ్‌గా నమోదైతే ఆర్థిక మాంద్యం ఉన్నట్టుగా భావిస్తారు.
దీనికి తోడు నిరుద్యోగం, వినియోగదారుల ఖర్చు, పారిశ్రామిక ఉత్పత్తి లాంటి అంశాలు తగ్గితే మాంద్యం మరింత తీవ్రతరమవుతుంది.
కొవిడ్ సమయంలో అమెరికాలో కేవలం రెండు నెలలపాటు మాంద్యం ఉన్నా ప్రభుత్వం తక్షణ మద్దతుతో ఆర్థిక వ్యవస్థను త్వరగా నిలబెట్టగలిగింది.
Details
ప్రస్తుత పరిస్థితి
ఈ ఏడాది జనవరిలో అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలు తక్కువగా భావించారు. నిరుద్యోగ రేటు తక్కువగా ఉండటం, వేతనాలు పెరగడం వల్ల వినియోగదారుల వ్యయ సామర్థ్యం అధికంగా ఉంది.
కానీ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, విదేశీ ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి.
చైనాపై సుంకాల విధింపు అర్థమయ్యే విషయమే కానీ, మెక్సికో, కెనడాలపై కూడా ట్రంప్ సుంకాలు విధించడం పలు వ్యాపార సంస్థల ఆందోళనకు కారణమైంది.
కరోనా సమయంలో ప్రభుత్వం మద్దతుగా నిలిచినా ఇప్పుడు మళ్లీ మాంద్యం వస్తే తగిన నిధుల బలం లేకపోవచ్చన్న భయాలు ఉన్నాయి.
Details
భారత్‌పై ప్రభావం
ఏప్రిల్ 2 నుండి ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అంటే అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తే, భారత్ ఉత్పత్తులపై కూడా అంతే విధిస్తారు.
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు భారత్ ప్రయత్నిస్తున్నా ప్రస్తుతానికి అనిశ్చితి నెలకొంది.
టారిఫ్‌ల ప్రభావంతో, విదేశీ పెట్టుబడిదారులు వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు.
అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని భావిస్తున్నారు.
Details
భారత్‌పై మాంద్యం ప్రభావం
1. భారతీయుల ఉపాధిపై ప్రభావం
అమెరికాలో పని చేసే భారతీయుల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో వారి కుటుంబాలకు పంపే రెమిటెన్సెస్ తగ్గిపోవచ్చు.
2. ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం
అమెరికా వాణిజ్య సంస్థలు తమ ఐటీ వ్యయాలను తగ్గించవచ్చు.
ఇందువల్ల భారత ఐటీ కంపెనీల ఆదాయంపై ప్రభావం పడొచ్చు. ఇప్పటికే ఇన్ఫోసిస్, కోఫోర్జ్ వంటి సంస్థల షేర్లు నష్టపోతున్నాయి.
3. ఎగుమతులపై ప్రతికూల ప్రభావం
ఫిబ్రవరిలో భారత్ ఎగుమతులు తగ్గాయి. మాంద్యం కారణంగా ఇది మరింత తగ్గే అవకాశం ఉంది.
Details
4. రూపాయి విలువపై ఒత్తిడి
ఆసియాలో అధ్వాన పనితీరు కనబరుస్తున్న రూపాయిపై మరింత ఒత్తిడి పెరగొచ్చు.
5. స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి
టారిఫ్‌లు, మాంద్యం కలిసి స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఊగిసలాటకు దారితీయొచ్చు. విదేశీ పెట్టుబడులు, మూలధన ప్రవాహాల పరంగా అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది.
మొత్తంగా
అమెరికాలో మాంద్యం వస్తే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. భారతీయ ఐటీ రంగం, ఎగుమతులు, స్టాక్ మార్కెట్లు దీని ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంది.
అమెరికా-భారత్ మధ్య చర్చలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా మారతాయో గమనించాల్సిన అవసరం ఉంది.