Gurugram: భారత్‌కు మరో ఐకానిక్ టవర్.. గురుగ్రామ్‌లో 700 మీటర్ల ఎత్తైన భవనం!
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న గ్లోబల్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దేశంలోనే అత్యంత ఎత్తైన భవనాన్ని నిర్మించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గురుగ్రామ్‌లో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టును హరియాణా స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్‌ఎస్‌ఐఐడీసీ) అభివృద్ధి చేస్తోంది. సుమారు 1,000 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న గ్లోబల్ సిటీలో వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, నివాస ప్రాజెక్టులు వంటి ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 6.7 ఎకరాల స్థలంలో 620 నుంచి 700 మీటర్ల ఎత్తుతో ఒక భారీ టవర్‌ను నిర్మించాలని హెచ్‌ఎస్‌ఐఐడీసీ ప్రణాళిక రూపొందించినట్లు ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించింది.
వివరాలు
ప్రపంచ స్థాయిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం
ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత ఎత్తైన భవనంగా ఉన్న ముంబయిలోని పాలస్ రాయల్ (320 మీటర్లు) రికార్డు బద్దలవుతుంది. అంతేకాకుండా ఈ టవర్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా (828 మీటర్లు) కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో అత్యంత ఎత్తైన భవనంగా నోయిడాలోని సైబర్‌థమ్ టవర్-ఎ (213.70 మీటర్లు) ఉంది. గురుగ్రామ్‌లో ప్రతిపాదిస్తున్న కొత్త టవర్ నిర్మాణం పూర్తయితే, ఎత్తు పరంగా దేశంలోనే కాక ప్రపంచ స్థాయిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశముంది.