Old Rare Ganesha Idols: గుంటూరులో వెలుగుచూసిన 1,600 ఏళ్ల నాటి అరుదైన గణేశ విగ్రహాలు
ఈ వార్తాకథనం ఏంటి
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో సుమారు 1,600 సంవత్సరాల నాటి రెండు అరుదైన గణేశ విగ్రహాలు వెలుగుచూశాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన రైతు సింహాద్రి వెంకట్రామరెడ్డి తన పొలంలోని పాటిదిబ్బను దున్నుతున్న సమయంలో నాగలికి తగిలి ఈ విగ్రహాలు భూమి పైకి వచ్చినట్లు వెల్లడించారు. ఈ గణేశ విగ్రహాలు ఎర్ర ఇసుకరాతి (చింతామణి రాయి)తో చెక్కబడ్డాయని ఆయన వివరించారు. వాటిలో ఒకటి సుమారు 3 సెంటీమీటర్ల ఎత్తు, 2 సెంటీమీటర్ల వెడల్పు, మరొకటి 5 సెంటీమీటర్ల ఎత్తు, 4 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.
వివరాలు
క్రీస్తుశకం ఒకటి నుంచి నాలుగో శతాబ్దం మధ్యకాలానికి చెందిన పెంకులు
విగ్రహాలతో పాటు ఎరుపు, నలుపు, నలుపు-ఎరుపు, గచ్చకాయ, గోధుమ రంగులకు చెందిన మట్టి పాత్రల పెంకులు కూడా లభించాయని తెలిపారు.
ఈ పెంకులు క్రీస్తుశకం ఒకటి నుంచి నాలుగో శతాబ్దం మధ్యకాలానికి చెందినవిగా పురావస్తు నిపుణులు గుర్తించినట్లు వెల్లడించారు.
ఈ గణేశ ప్రతిమల రూపకల్పన పల్నాడు జిల్లా చేజర్లలోని కపోతేశ్వర ఆలయంలో ఉన్న పాలరాతి గణేశ విగ్రహాన్ని పోలి ఉందని శివనాగిరెడ్డి తెలిపారు.
వివరాలు
కందరాపురంగా చేజెర్ల
ఈ పోలిక ఆధారంగా పరిశీలిస్తే, ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని చేజెర్లను అప్పట్లో కందరాపురంగా పిలిచేవారని, అక్కడి కేంద్రంగా పాలించిన ఆనందగోత్రిక రాజుల కాలం, అంటే క్రీస్తుశకం నాలుగో శతాబ్దానికి చెందినవిగా ఈ విగ్రహాలను భావిస్తున్నట్లు వివరించారు.
చారిత్రక, పురావస్తు పరంగా అత్యంత విలువైన ఈ గణేశ విగ్రహాలు, ఇతర పురాతన అవశేషాలను భవిష్యత్ తరాలకు అందేలా సంరక్షించాలని డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి రైతు సింహాద్రి వెంకట్రామరెడ్డిని కోరారు.