మైక్రోసాఫ్ట్‌లో మరోసారి భారీ తొలగింపులు.. కొనసాగుతున్న లేఆఫ్ ప్రక్రియ
ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామన్న టెకీ సంస్థ, వాటికి అదనంగా తాజాగా మరిన్ని కోతలు పెట్టింది. 2023- 2024 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలివారం నుంచే తొలగింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు టెక్ దిగ్గజం స్పష్టం చేసింది. అమెరికాలోని వాషింగ్టన్ కార్యాలయంలో ఉన్న ఉద్యోగుల్లో 276 మందిని తీసేసి భారం తగ్గించుకుంది. అందులో 66 మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పని చేస్తున్నవారు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో సేల్స్, కస్టమర్ సక్సెస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు.
ఖర్చులను తగ్గించుకునేందుకే లేఆఫ్‌లు తెచ్చాం : మైక్రోసాఫ్ట్
ఈ క్రమంలోనే సదరు ఉద్యోగలు తాము కొలువులు కోల్పోయినట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. క్లౌడ్ కంప్యూటింగ్ బిల్లులో ఖర్చులను తగ్గించుకునేందుకే లేఆఫ్‌లు తెచ్చామని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. రాబోయే కాలంలో ఉద్యోగుల తొలగింపులు భారీగా ఉంటాయని సంస్థ ప్రకటించింది. అయితే ఆ సంఖ్యను వెల్లడించేందుకు సముఖత చూపించలేదు. సంస్థాగత, శ్రామిక సర్దుబాట్లు తమ వ్యాపార నిర్వహణలో సాధారణమేనని తెలిపింది. తమ సంస్థ భవిష్యత్తు కోసం కస్టమర్లకు మద్దతుగా వ్యూహాత్మక వృద్ధి రంగాలకు ప్రాధాన్యమిస్తామని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక అస్థిరతలు, మాంద్యంతో కంపెనీలన్నీ వ్యయ నియంత్రణ చర్యలను వేగం చేస్తున్నాయి. ఈ మేరకు అమెజాన్, గూగుల్, ట్విట్టర్ సహా ప్రముఖ టెక్ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగాలపై కోత పెడుతున్నాయి.