'మెటా'లో మరో విడత ఉద్యోగుల తొలగింపు; లిస్ట్‌లో భారత్‌లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా మరో విడత ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. ఇప్పటికే రెండు రెండు దశల్లో ఉద్యోగులను తొలగించిన 'మెటా' సీఈఓ మార్క్ జూకర్ బర్గ్, తాజాగా చివరి విడతలో 6,000మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. చివరి విడతలో తొలగించిన ఉద్యోగుల జాబితాలో భారత్‌లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. మార్కెటింగ్ డైరెక్టర్ అవినాష్ పంత్, డైరెక్టర్, మీడియా భాగస్వామ్య అధిపతి సాకేత్ ఝా సౌరభ్‌తో పాటు మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ఇంజనీరింగ్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, కంటెంట్ స్ట్రాటజీ, కార్పొరేట్ కమ్యూనికేషన్‌ల వంటి టీమ్‌లలోని అనేక మంది ఉద్యోగులు తాజా లేఆఫ్‌లో తమ ఉద్యోగాలను కోల్పోయారు.
మొత్తం 21వేల మంది ఉద్యోగుల తొలగింపు
అర్థిక అనిశ్చితి నేపథ్యంలో నవంబర్‌లో 11,000 మంది ఉద్యోగులను తొలగించిన మెటా మార్చిలో మరో 4,000 మందిని పక్కన పెట్టింది. అయితే మార్చిలో లేఆఫ్స్ సమయంలో మే నెల చివరి నాటికి 10వేల మందిని ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఆ ప్రకటనలో భాగంగా మార్చిలో 4వేల మందిని తొలగించారు. తాజాగా 6వేల మందికి ఉద్వాసన పలికారు. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి దాకా ఫేస్ బుక్ మొత్తం 21వేల మంది ఉద్యోగులను తొలగించింది. తమ ఉద్యోగాలను కోల్పోయిన వారు వార్తలను లింక్డ్‌ఇన్‌వేదికగా పంచుకున్నారు.