Loading...
Anthropic: తొలి రోజే ఆంత్రోపిక్ షేర్లకు భారీ డిమాండ్.. భారతీయుల జోరు!
తొలి రోజే ఆంత్రోపిక్ షేర్లకు భారీ డిమాండ్.. భారతీయుల జోరు!

Anthropic: తొలి రోజే ఆంత్రోపిక్ షేర్లకు భారీ డిమాండ్.. భారతీయుల జోరు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంత్రోపిక్ షేర్లు భారత ఇన్వెస్టర్లను విశేషంగా ఆకర్షించాయి. నవంబర్ 19న నాస్‌డాక్‌లో లిస్టింగ్ అయిన ఈ షేర్లకు భారతీయ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లలో భారీ స్పందన లభించింది. INDmoneyలో అంతర్జాతీయ పెట్టుబడుల్లో ఏకంగా 40 శాతం ఆంత్రోపిక్ షేర్లకే వెళ్లినట్లు సంస్థ వెల్లడించింది. మరోవైపు Vested ప్లాట్‌ఫామ్‌లో గురువారం జరిగిన మొత్తం ట్రేడింగ్ విలువలో ఈ షేర్ల వాటా 11 శాతంగా నమోదైంది. GIFT City మార్గం ద్వారా భారతీయులకు అంతర్జాతీయ పెట్టుబడుల అవకాశాలు కల్పిస్తున్న అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌లలో INDmoney, Vested రెండూ ఉన్నాయి.

వివరాలు 

ఐపీఓ ధర కంటే 34 శాతం అధికంగా లిస్టింగ్!

గురువారం నాస్‌డాక్‌లో ఆంత్రోపిక్ షేర్లు బలమైన ఆరంభాన్ని నమోదు చేశాయి.

ఒక్కో షేరు 111.5 డాలర్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. కంపెనీ ఐపీఓ ధర 83 డాలర్లతో పోలిస్తే ఇది 34 శాతం అధికం.

ఈ ప్రారంభ ధరతో కంపెనీ మార్కెట్ విలువ సుమారు 2 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా.

ప్రపంచంలోనే ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పబ్లిక్ షేర్ విక్రయం తర్వాత ఈ లిస్టింగ్ జరిగింది.

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ లిస్టింగ్‌ను సైతం అధిగమించింది.

INDmoneyలో ఆంథ్రోపిక్ షేర్ల కొనుగోలుకు వచ్చిన సగటు ఆర్డర్ విలువ కూడా ఆ ప్లాట్‌ఫామ్ సాధారణ సగటు ఆర్డర్ విలువ కంటే దాదాపు రెండింతలు ఎక్కువగా ఉందని సంస్థ తెలిపింది.

వివరాలు 

తొలి రెండు గంటల్లోనే 84 శాతం ట్రేడింగ్..  

Vestedలో గురువారం జరిగిన మొత్తం ట్రేడింగ్ విలువలో ఆంత్రోపిక్ వాటా 11 శాతంగా ఉండగా, మొత్తం ట్రేడ్లలో 9 శాతం ఈ కంపెనీ షేర్లపైనే జరిగాయి.

ట్రేడింగ్ విలువ పరంగా AMD తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఎన్విడియా కంటే ముందుంది.

అయితే ఆంత్రోపిక్ షేర్లపై ఆసక్తి ప్రధానంగా ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి కొన్ని గంటల్లోనే కనిపించింది.

Vestedలో జరిగిన మొత్తం ఆంథ్రోపిక్ ట్రేడ్లలో 84 శాతం మొదటి రెండు గంటల్లోనే నమోదయ్యాయి.

ఆ సెషన్‌లో ప్లాట్‌ఫామ్‌లో ట్రేడింగ్ చేసిన యాక్టివ్ ఇన్వెస్టర్లలో దాదాపు 20 శాతం మంది ఈ షేర్లను కొనుగోలు చేశారు.

ఒక్కో కొనుగోలు ఆర్డర్ సగటు విలువ సుమారు 1,100 డాలర్లుగా ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

ఆంథ్రోపిక్‌పై భారతీయుల ఆసక్తి.. స్పేస్‌ఎక్స్‌ను మించిన స్పందన!

అంటే దాదాపు 10 షేర్లను కొనుగోలు చేసినట్లు లెక్క. గురువారం Vestedలో ఎన్విడియాతో పోలిస్తే ఆంథ్రోపిక్ షేర్లు దాదాపు ఏడు రెట్లు ఎక్కువగా ట్రేడయ్యాయి.

కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన ఈ ఏఐ సంస్థపై ఇన్వెస్టర్ల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో ఇది స్పష్టం చేస్తోంది.

లిస్టింగ్‌కు ముందే భారతీయ ఇన్వెస్టర్లలో ఆంథ్రోపిక్‌పై ఆసక్తి పెరిగినట్లు పెట్టుబడి సంస్థలు వెల్లడించాయి.

ఈ కంపెనీకి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన ఎంక్వైరీలు గణనీయంగా పెరిగాయి.

గతంలో అంతర్జాతీయ పెట్టుబడుల సేవలు అందిస్తున్న కొన్ని ప్లాట్‌ఫామ్‌లలో స్పేస్‌ఎక్స్ లిస్టింగ్‌తో పోలిస్తే ఆంథ్రోపిక్‌పై దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఆసక్తి కనిపించింది.

ADVERTISEMENT

వివరాలు 

గిఫ్ట్ సిటీ ద్వారా అమెరికా షేర్లలో పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు

మరోవైపు గ్రోవ్, అప్‌స్టాక్స్, జెరోధా, ఏంజెల్ వన్ వంటి దేశీయ బ్రోకరేజ్ సంస్థలు కూడా GIFT City ద్వారా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల సేవలను ప్రారంభించాయి.

దీంతో భారతీయ ఇన్వెస్టర్లు అమెరికా షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.

ఆంథ్రోపిక్ లిస్టింగ్ రోజున నమోదైన ట్రేడింగ్ గణాంకాలు చూస్తే.. కంపెనీపై ఉన్న ఆసక్తి కేవలం విచారణలకే పరిమితం కాకుండా వాస్తవ కొనుగోళ్ల రూపంలోనూ కనిపించినట్లు తెలుస్తోంది.

వివరాలు 

ఆంథ్రోపిక్ లిస్టింగ్‌తో ఓపెన్‌ఏఐ ఐపీఓకు ఊతం!

ఈ అంశంపై క్యాప్‌వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు, సీఈఓ నరేశ్ బియానీ స్పందించారు.

"తొలిరోజు ట్రేడింగ్ ద్వారా కంపెనీ షేర్లకు ఎంత డిమాండ్ ఉందో తెలుస్తుంది. కానీ వాటి అసలు విలువను అంచనా వేయడానికి మరికొన్ని త్రైమాసికాల ఫలితాలను పరిశీలించాలి. కంప్యూటింగ్ ఖర్చులు తగ్గినప్పుడు కంపెనీ లాభాల మార్జిన్లు మెరుగుపడతాయా? పోటీ సంస్థల మధ్య కూడా వృద్ధిని కొనసాగించగలదా? షేర్లపై లాక్-ఇన్ గడువు ముగిసిన తర్వాత వాటి ధర ఎలా మారుతుంది? అనేవి కీలకం" అని ఆయన పేర్కొన్నారు.

ఆంథ్రోపిక్ బలమైన లిస్టింగ్‌తో ఓపెన్‌ఏఐ వంటి భారీ ఏఐ సంస్థల ఐపీఓలకు కూడా మార్గం సుగమం కావచ్చని, అయితే వాటి విలువల్లో ఒడుదొడుకులు కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

చిప్‌ తయారీ సంస్థలపై కొనసాగుతున్న నమ్మకం

మరోవైపు ఆంథ్రోపిక్‌కు తొలిరోజు భారీ స్పందన వచ్చినప్పటికీ సెమీకండక్టర్ రంగంలోని AMD, ఎన్విడియా వంటి కంపెనీలపై ఇన్వెస్టర్ల నమ్మకం కొనసాగుతోందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.

ఏఐ రంగంలో కొత్త కంపెనీలు మార్కెట్లోకి వస్తున్నా, చిప్ తయారీ సంస్థలకు కూడా పెట్టుబడిదారుల నుంచి బలమైన మద్దతు లభిస్తోందని ఈ ట్రేడింగ్ వివరాలు వెల్లడిస్తున్నాయి.

ADVERTISEMENT