LOADING...
Anthropic: ఐపీఓ బాటలో ఆంత్రోపిక్.. వాల్యుయేషన్‌లో ఓపెన్ఏఐకి షాక్
ఐపీఓ బాటలో ఆంత్రోపిక్.. వాల్యుయేషన్‌లో ఓపెన్ఏఐకి షాక్

Anthropic: ఐపీఓ బాటలో ఆంత్రోపిక్.. వాల్యుయేషన్‌లో ఓపెన్ఏఐకి షాక్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ మరో కీలక అడుగు వేసింది. అమెరికా స్టాక్ మార్కెట్లో పబ్లిక్ లిస్టింగ్‌కు సిద్ధమవుతూ, ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కోసం అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) వద్ద రహస్యంగా దరఖాస్తు చేసుకున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీంతో ప్రపంచ టెక్ రంగం దృష్టి మరోసారి ఆంత్రోపిక్‌పై పడింది.

వివరాలు 

ఎస్‌ఈసీకి రహస్యంగా పత్రాల సమర్పణ

ఐపీఓ ప్రక్రియలో భాగంగా ఫామ్ ఎస్-1 డ్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ స్టేట్‌మెంట్‌ను ఎస్‌ఈసీకి సమర్పించినట్లు ఆంత్రోపిక్ తెలిపింది. ఎస్‌ఈసీ పరిశీలన పూర్తైన తర్వాత పబ్లిక్ లిస్టింగ్ ప్రక్రియ ముందుకు సాగే అవకాశముందని సంస్థ పేర్కొంది. అయితే షేర్ల సంఖ్య, వాటి ధర, ఇష్యూ పరిమాణం వంటి కీలక వివరాలను ప్రస్తుతం వెల్లడించలేదు. మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ సంస్థల అనుమతులు తదితర అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

వివరాలు 

మార్కెట్ విలువలో భారీ దూకుడు

మే నెల చివరి వారంలో ఆంత్రోపిక్ భారీ స్థాయిలో పెట్టుబడులను సమీకరించింది. 65 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ తర్వాత సంస్థ వాల్యుయేషన్ ఏకంగా 965 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ప్రపంచంలో అత్యంత విలువైన ప్రైవేట్ టెక్నాలజీ సంస్థల జాబితాలో ఆంత్రోపిక్ అగ్రస్థానాలకు చేరుకుంది. అదే సమయంలో ఏఐ రంగంలో తన ప్రధాన ప్రత్యర్థిగా భావించే ఓపెన్ఏఐను కూడా మార్కెట్ విలువ పరంగా అధిగమించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో 30 బిలియన్ డాలర్ల పెట్టుబడుల సమీకరణతో ఆంత్రోపిక్ విలువ 380 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయితే కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సంస్థ విలువ రెండింతలకు పైగా పెరగడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

Advertisement

వివరాలు 

ఏఐ రంగంలో పెరుగుతున్న పోటీ

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ కంపెనీలపై పెట్టుబడిదారుల ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. అధునాతన ఏఐ టెక్నాలజీల అభివృద్ధికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇదే సమయంలో స్పేస్‌ఎక్స్ కూడా 1.75 ట్రిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో 75 బిలియన్ డాలర్ల ఐపీఓను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఏఐ మార్కెట్లో ప్రస్తుతం ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ సంస్థల మధ్య పోటీ తీవ్రంగా కొనసాగుతోంది. అత్యాధునిక కంప్యూటింగ్ వనరులు, ప్రతిభావంతులైన నిపుణులు, కొత్త ఏఐ మోడళ్ల అభివృద్ధి విషయంలో ఈ రెండు సంస్థలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఐపీఓ ద్వారా సమీకరించే నిధులతో మార్కెట్లో తన స్థాయిని మరింత బలోపేతం చేయాలని ఆంత్రోపిక్ లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

వివరాలు 

ఆంత్రోపిక్ ఎలా ప్రారంభమైంది?

ఓపెన్ఏఐ సంస్థ విధానాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన కొందరు పరిశోధకులు, ఉన్నతాధికారులు కలిసి 2021లో ఆంత్రోపిక్ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత క్లాడ్ (Claude) పేరుతో రూపొందించిన ఏఐ మోడళ్ల ద్వారా సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కోసం రూపొందించిన 'క్లాడ్ కోడ్'కు మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాకుండా సైబర్ భద్రత రంగంలో కూడా ఆంత్రోపిక్ తన ఉనికిని చాటుకుంటోంది. ఇటీవల 'ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్'లో భాగంగా 'క్లాడ్ మైథోస్ ప్రివ్యూ' పేరుతో కొత్త సైబర్ సెక్యూరిటీ ఏఐ మోడల్‌ను సంస్థ ఆవిష్కరించింది. మానవ నిపుణులు గుర్తించలేని సైబర్ భద్రతా లోపాలను సైతం ఇది వేగంగా గుర్తించగలదని సంస్థ వెల్లడించింది.

Advertisement