Anthropic: భారీ ఫండింగ్‌కు సిద్ధమవుతున్న ఆంత్రోపిక్.. $900 బిలియన్ టార్గెట్!!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న AI కంపెనీలలో ఒకటైన ఆంత్రోపిక్ మరో భారీ ఫండింగ్ రౌండ్‌పై ఆలోచిస్తోంది. Claude అనే AI అసిస్టెంట్‌తో ప్రసిద్ధి చెందిన ఈ సంస్థకు సుమారు $50 బిలియన్ వరకు పెట్టుబడుల ఆఫర్లు వచ్చాయని TechCrunch తెలిపింది. కంపెనీ విలువ $850 బిలియన్ నుంచి $900 బిలియన్ మధ్య ఉండొచ్చని అంచనా. ఇదే విషయాన్ని ఈ నెల ప్రారంభంలో బ్లూమ్‌బెర్గ్, బిజినెస్ ఇన్‌సైడర్ కూడా వెల్లడించాయి. ఇప్పటికీ ఆంత్రోపిక్ ఫండింగ్‌పై తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే పెట్టుబడిదారుల ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ రౌండ్‌ను తిరస్కరించడం కష్టం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వివరాలు
ఆంత్రోపిక్ IPOకి ముందు చివరి ప్రైవేట్ ఫండింగ్ రౌండ్
ఇది కంపెనీ IPOకి ముందు చివరి ప్రైవేట్ ఫండింగ్ రౌండ్ కావచ్చని భావిస్తున్నారు. ఈ అంశంపై తుది నిర్ణయం మే నెలలో జరగనున్న బోర్డు మీటింగ్‌లో తీసుకునే అవకాశం ఉంది. ఈ ఫండింగ్ రౌండ్ $40 బిలియన్ నుంచి $50 బిలియన్ మధ్య ఉండొచ్చని సమాచారం. కానీ కంపెనీ వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారుల డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది. ఒక పెద్ద ఇన్వెస్టర్ $5 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆంత్రోపిక్ CFO కృష్ణరావు తో మీటింగ్ కోసం వేచి చూస్తున్నాడు. ఇటీవల కంపెనీ వార్షిక ఆదాయం $30 బిలియన్‌ను దాటింది. 2025 చివరికి ఇది సుమారు $9 బిలియన్ మాత్రమే ఉండగా, ఇప్పుడు $40 బిలియన్‌కు దగ్గరగా చేరింది.
వివరాలు
సెకండరీ మార్కెట్లలో ఆంత్రోపిక్ విలువ $1 ట్రిలియన్
ముఖ్యంగా క్లాడ్ కోడ్, కో వర్క్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా AI కోడింగ్ సేవల నుంచే ఎక్కువ ఆదాయం వస్తోంది. ఫిబ్రవరిలో ఆంత్రోపిక్ చివరిసారిగా $380 బిలియన్ విలువ వద్ద ఫండింగ్ పొందింది. ఇప్పుడు కొత్త రౌండ్ జరిగితే కంపెనీ విలువ రెట్టింపు కంటే ఎక్కువ పెరగనుంది. ఇది ప్రధాన పోటీదారు ఓపెన్‌ఏఐ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఇటీవల ఓపెన్‌ఏఐ కూడా $122 బిలియన్ భారీ ఫండింగ్‌ను $852 బిలియన్ విలువ వద్ద సమీకరించింది. మరోవైపు సెకండరీ మార్కెట్లలో ఆంత్రోపిక్ విలువ ఇప్పటికే $1 ట్రిలియన్ వరకు చేరినట్లు సమాచారం.